విభజిత రాష్ట్రంలో రిజర్వేషన్‌ ప్రయోజనాలుండవా?

ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్‌ పొందిన షెడ్యూల్‌ కులాలకు చెందిన ఓ వ్యక్తి విభజన తర్వాత ఏర్పాటైన రాష్ట్రంలో తన కోటా ప్రయోజనాలను కోల్పోతారా?..

Published : 21 Jul 2021 12:28 IST

సుప్రీంకోర్టులో విచారణ

దిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్‌ పొందిన షెడ్యూల్‌ కులాలకు చెందిన ఓ వ్యక్తి విభజన తర్వాత ఏర్పాటైన రాష్ట్రంలో తన కోటా ప్రయోజనాలను కోల్పోతారా? - ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇలాంటి ప్రశ్న తొలిసారి తమ ముందుకి వచ్చినట్లు జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి ఉదంతం ఎక్కడైనా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని విచారించనున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో సహకరించాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ని అడిగింది. ఝార్ఖండ్‌ హైకోర్టు గత ఏడాది ఫిబ్రవరి 24న ఇచ్చిన ఓ తీర్పును సవాల్‌ చేస్తూ పంకజ్‌ కుమార్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో అపీల్‌ దాఖలు చేశారు. ఆయన బిహార్, ఝార్ఖండ్‌ రెండు రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్‌ ప్రయోజనాలను పొందలేరంటూ హైకోర్టు అప్పట్లో 2:1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా ఝార్ఖండ్‌ అదనపు ఏజీ అరుణభ్‌ చౌధురి సుప్రీంకోర్టుకు తన వాదనలను వినిపించారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్లు చెప్పారు. విచారణ గురువారం కూడా కొనసాగనుంది.

క్లాట్‌ అభ్యర్థుల వ్యాక్సినేషన్‌పై..
కామన్‌ లా అడ్మిషన్‌ పరీక్ష (క్లాట్‌) - 2021కి హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని పట్టుపట్టొద్దని సుప్రీంకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈనెల 23న నిర్వహిస్తున్న ఈ పరీక్షను ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని జస్టిస్‌ ఎల్‌.ఎన్‌.రావు, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
దేశంలోని జాతీయ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు గాను ‘క్లాట్‌’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గాను ఈ పరీక్ష నిర్వహణకు జూన్‌ 14న జాతీయ లా యూనివర్సిటీల కన్సార్షియమ్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ‘క్లాట్‌’ నోటిఫికేషన్‌లో.. పెన్‌-పేపర్‌ విధానంలో అనేక కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల్లో చాలామంది 18 ఏళ్ల లోపు వారున్నారని, వారు వ్యాక్సిన్‌ వేయించుకోవడం సాధ్యం కాదని పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. అలాగే కొవిడ్‌ నిబంధనలు అమలవుతున్న ప్రాంతాల్లో నివాసం ఉండే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం కూడా కష్టమవుతుందని వాదించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts