US: ఒబామా వలస విధానం చట్టవిరుద్ధం 

అమెరికాలో ఒబామా హయాంలో తీసుకొచ్చిన వలస విధానం చట్టవిరుద్ధమంటూ

Updated : 18 Jul 2021 12:30 IST

టెక్సాస్‌ న్యాయమూర్తి తీర్పు

 అపీల్‌కు వెళ్తామన్న అధ్యక్షుడు బైడెన్‌

హూస్టన్‌: అమెరికాలో ఒబామా హయాంలో తీసుకొచ్చిన వలస విధానం చట్టవిరుద్ధమంటూ టెక్సాస్‌లోని ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి ఆండ్రూ హానెన్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. నాటి విధానం 6 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులకు రక్షణ కవచంలా నిలిచిందని అభ్యంతరం చెప్పారు. తాజా తీర్పు.. ‘డ్రీమర్స్‌’కు చట్టబద్ధమైన రక్షణ, పౌరసత్వం కల్పించాలనుకుంటున్న ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ యంత్రాంగం ప్రయత్నాలకు విఘాతంగా మారింది. ఈ తీర్పుపై అపీల్‌కు వెళ్తామని బైడెన్‌ ప్రకటించారు. ఒబామా హయాంలో 2012లో డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ (డీఏసీఏ) చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన మైనర్లు (డ్రీమర్లు)పై బహిష్కరణ చర్యలు చేపట్టకుండా తగిన రక్షణ కల్పిస్తారు. ఈ విధానాన్ని రద్దు చేస్తూ గత ఏడాది ట్రంప్‌ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ డీఏసీఏ చట్టం అమలుపై మరో అడుగు ముందుకేసి డ్రీమర్లకు పౌరసత్వం కల్పించాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. టెక్సాస్, మరో ఎనిమిది రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్య రాష్ట్రాలు కలిసి టెక్సాస్‌ ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.

నాటి అధ్యక్షుడు ఒబామా పరిపాలనా యంత్రాంగం తన పరిధులు అతిక్రమించి డీఏసీఏ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇకపై దేశ భద్రతా విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ) డీఏసీఏ తరహా చట్టాలు తయారు చేయకుండా కాంగ్రెస్‌ అడ్డుకోవాలని కూడా న్యాయమూర్తి సూచించారు. అమెరికా వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా డీఏసీఏ కింద రక్షణ పొందుతుండగా, కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో చెరో లక్ష మందికి పైగా ఉన్నారు. తాజా తీర్పు డీఏసీఏ రక్షణ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారిపై ప్రభావం చూపనుంది. కోర్టు తీర్పుపై అధ్యక్షుడు బైడెన్‌తో పాటు అధికార డెమొక్రాట్లు పెదవివిరిచారు. టెక్సాస్‌ ఫెడరల్‌ న్యాయమూర్తి తీర్పు తమను తీవ్రంగా నిరాశ పరిచిందని బైడెన్‌ అన్నారు. దీనిపై తమ న్యాయ విభాగం అపీల్‌కు వెళ్తుందని ప్రకటించారు. ఇప్పటికైనా వలసదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్‌ను ఆయన మరోసారి కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని