China: దలైలామా వారసునిపై చైనాకు అధికారం లేదు

టిబెటన్‌ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుని ఎంపికలో చైనా ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ బౌద్ధ ఆరామం ప్రకటించింది. మతాలపై నమ్మకం లేని ప్రభుత్వానికి ఈ...

Updated : 25 Oct 2021 09:32 IST

తవాంగ్‌ బౌద్ధ ఆరామం స్పష్టీకరణ

తవాంగ్‌: టిబెటన్‌ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుని ఎంపికలో చైనా ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ బౌద్ధ ఆరామం ప్రకటించింది. మతాలపై నమ్మకం లేని ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమి ప్రమేయం ఉంటుందని ప్రశ్నించింది. వారసుని ఎంపిక పూర్తిగా ఆధ్యాత్మికపరమైనదని, ఇది రాజకీయ సమస్య కాదని స్పష్టం చేసింది. చైనా సరిహద్దుల విస్తరణ విధానాన్ని అవలంబిస్తోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఆ ఆరామం మఠాధిపతి గ్యాంగ్‌బంగ్‌ రింపోచే కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. 350 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆరామం చైనా సరిహద్దుల్లో ఉండడం గమనార్హం. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆరామం కావడం విశేషం. ఈ ప్రాంతం తమదేనని చైనా చెబుతూ వస్తోంది. ప్రస్తుత దలైలామాతో పాటు, ఆయన అనుచరులే వారసునిని ఎంపిక చేస్తారని రింపోచే చెప్పారు. ఇందులో జోక్యం చేసుకునే అధికారం కూడా చైనాకు లేదని తెలిపారు. ఈ విషయంలో చైనా తీసుకునే నిర్ణయాన్ని టిబెటన్లు ఆమోదించబోరని స్పష్టం చేశారు. ప్రస్తుతం ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్న దలైలామాకు 86 ఏళ్లు నిండడంతో వారసునిపై చర్చలు మొదలయ్యాయి. దలైలామాను సాక్షాత్తూ బుద్ధుని అవతారంగా టిబెటన్లు భావిస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని