
Lockdown: లాక్డౌన్లో చైనా.. కొవిడ్ కేసుల పెరుగుదలతో అప్రమత్తం
బీజింగ్: చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అనేక ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్లు విధించింది. నగరాల్లో అధిక సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు బుధవారం ఆదేశాలిచ్చింది. చైనా తూర్పు తీరంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని పుతియాన్ నగరవ్యాప్తంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఈ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. జియోమెన్, క్వాన్‌జౌలలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించారు. 2019 ఆఖరులో కరోనా వైరస్ తొలుత చైనాలోని వూహాన్‌లోనే బయటపడిన సంగతి తెలిసిందే. అనంతరం కొవిడ్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టిన చైనా ప్రస్తుతం కూడా అలాంటి విధానాలనే అనుసరిస్తోంది. ఇటీవలి కాలంలోనే కొత్తగా ఫుజియాన్ ప్రాంతంలో 152 కేసులు బయటపడగా.. అక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అత్యధిక సాంక్రమికశక్తి కలిగిన డెల్టా రకంతో పాటు, మరికొన్ని వేరియంట్లు వ్యాప్తి చెందుతుండటంతో చైనా మరిన్ని చర్యలు చేపట్టింది.
కంబోడియాలో చిన్నారులకు వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా 6-11 ఏళ్ల పిల్లలకు కొవిడ్ టీకాలు వేసేందుకు కంబోడియా ఉపక్రమించింది. ఈమేరకు 18 లక్షల మంది పిల్లలకు టీకా వేయనున్నట్లు ప్రధాని హన్సేన్ బుధవారం తెలిపారు. 3-5 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు వేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.