Covaxin: వచ్చేవారం నుంచి రెండో డోసు ట్రయల్స్‌

చిన్నారులపై కొవాగ్జిన్‌ టీకా ఔషధ పరీక్షల్లో భాగంగా 2-6 ఏళ్ల వయసు వారికి వచ్చే వారం నుంచి రెండో డోసు టీకా ఇవ్వనున్నారు.

Updated : 20 Jul 2021 08:00 IST

దిల్లీ: చిన్నారులపై కొవాగ్జిన్‌ టీకా ఔషధ పరీక్షల్లో భాగంగా 2-6 ఏళ్ల వయసు వారికి వచ్చే వారం నుంచి రెండో డోసు టీకా ఇవ్వనున్నారు. కొవిడ్‌-19కు సంబంధించి భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకాను 2 నుంచి 18 ఏళ్ల వారిపై పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. 6-12 ఏళ్ల వయసు వారికి ఇప్పటికే రెండో డోసు ఇచ్చినట్లు దిల్లీలోని ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. దేశంలో చిన్నారులపై కొవాగ్జిన్‌ టీకా ఔషధ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో దిల్లీ ఎయిమ్స్‌ ఒకటి. దేశంలో కరోనా మూడో దశ ఉద్ధృతి చోటుచేసుకోవచ్చన్న అంచనాల నేపథ్యంలో చిన్నారులపై కొవిడ్‌-19 టీకా ఔషధ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు, చిన్నారులకు కరోనా టీకా సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఔషధ పరీక్షల్లో భాగంగా చిన్నారులను వయసుల వారీగా బృందాలుగా విభజించారు. ఒక్కో బృందంలో 175 మంది చిన్నారులను ఉంచి వారికి టీకా ఇస్తున్నారు. ఇలా రెండు డోసుల టీకా పొందిన చిన్నారులను పరీక్షిస్తారు. అనంతరం ఆగస్టు చివరికల్లా ఔషధ పరీక్షల మధ్యంతర నివేదిక వచ్చే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని