Covid: ఈ 7 లక్షణాలు ఉంటే.. కొవిడ్‌ సోకినట్టే!

కొవిడ్‌ పరీక్ష వసతులు అంతగా లేనిచోట- టెస్టింగ్‌ కిట్లను సమర్థంగా వినియోగించేందుకూ, బాధితులు ఎవరై ఉండొచ్చన్న అంచనాకు వచ్చేందుకూ... పరిశోధకులు

Published : 30 Sep 2021 06:57 IST

లండన్‌: కొవిడ్‌ పరీక్ష వసతులు అంతగా లేనిచోట- టెస్టింగ్‌ కిట్లను సమర్థంగా వినియోగించేందుకూ, బాధితులు ఎవరై ఉండొచ్చన్న అంచనాకు వచ్చేందుకూ... పరిశోధకులు 7 లక్షణాలను పేర్కొన్నారు. ఇవన్నీ ఉన్నవారికి మహమ్మారి సోకి ఉండవచ్చన్న ప్రాథమిక అంచనాకు రావచ్చని సూచించారు. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన శాస్త్రవేత్తలు 2020 జూన్‌-2021 జనవరి మధ్య కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న వారిని పలు ప్రశ్నలు అడిగారు. టెస్టింగ్‌కు ముందు వారిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకున్నారు. తర్వాత వీటన్నింటినీ మదింపు చేసి, ఏడు ఉమ్మడి లక్షణాలను ఎంపిక చేశారు. ఇవన్నీ ఉన్నవారిలో 70-75 శాతం మందికి పీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితం రావడం గమనార్హం. ‘‘రుచి, వాసనలను కోల్పోవడం లేదా వాటిని గుర్తించే సామర్థ్యం తగ్గడం, చలి, దగ్గు, జ్వరం, కండరాల నొప్పులు, ఆకలి మందగించడం- ఈ లక్షణాలు ఉన్నవారికి కరోనా సోకిందని ప్రాథమికంగా భావించవచ్చు. కిట్ల కొరత ఉన్నప్పుడు ముందుగా ఇలాంటి వారికి పరీక్షలు నిర్వహించాలి. తర్వాత మిగతా వారికి కూడా పరీక్షలు చేపట్టడం మేలు. కరోనా సోకినా కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదన్న విషయాన్ని మాత్రం విస్మరించకూడదు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. పబ్లిక్‌ లైబ్రరీ ఆఫ్‌ సైన్స్‌ మెడిసిన్‌ పత్రిక ఈ వివరాలను అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని