Corona Vaccine: మోడెర్నాతో కనీసం 6 నెలల రోగ నిరోధకత

కొవిడ్‌-19 నియంత్రణకు వాడే మోడెర్నా వ్యాక్సిన్‌తో కలిగే రోగనిరోధక శక్తి కనీసం ఆర్నెల్లు ఉంటుందని,

Published : 16 Sep 2021 11:30 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 నియంత్రణకు వాడే మోడెర్నా వ్యాక్సిన్‌తో కలిగే రోగనిరోధక శక్తి కనీసం ఆర్నెల్లు ఉంటుందని, ఈ వ్యాక్సిన్‌ వినియోగించిన వ్యక్తులకు మళ్లీ ఎక్కడా బూస్టర్‌ డోసు అవసరం కూడా రాలేదని ఓ అధ్యయనం తేల్చింది. ఓ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం మేరకు.. మనిషిలో సహజ రోగనిరోధకత వృద్ధి చెందే ఈ ఆర్నెల్ల కాలం ఎంతో కీలకం. మోడెర్నాతో బలమైన రోగనిరోధకత, యాంటీబాడీల వృద్ధి సాధ్యమై ఎక్కువకాలం అండగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. 70 ఏళ్లు దాటిన వ్యక్తులతోపాటు అన్ని వయసులవారిపై ఈ వాక్సిన్‌ను పరీక్షించినట్లు వెల్లడించారు. ‘దీని రోగనిరోధకత స్థిరమైనది, ప్రభావశీలమైనది కూడా. ఇది శుభ సూచకం’ అని అమెరికాలోని లా జొల్లా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇమ్యునాలజీ ప్రొఫెసర్‌ షేన్‌ క్రాటి తెలిపారు. మొదటిదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో.. కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వ్యక్తులతో 25 మైక్రోగ్రాముల మోడెర్నా వ్యాక్సిన్‌ డోసు తీసుకున్న వ్యక్తులను పరిశోధకులు పోల్చి చూశారు. ‘డోసులో నాలుగోవంతు ఏ మేరకు రోగ నిరోధకతను పెంచుతుందో మేము చూడాలనుకున్నాం’ అని మరో పరిశోధకుడు చెప్పారు. ఈ చిన్న డోసుతోనే ‘టి’ సెల్, యాంటీబాడీల స్పందన స్థిరంగా, దృఢంగా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. మోడెర్నా వ్యాక్సిన్‌కు అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (ఎఫ్‌డీఏ) అత్యవసర గుర్తింపు ఇచ్చింది. కొమ్ము ఆకృతిలోని స్పైక్‌ ప్రొటీన్‌ ద్వారా కరోనా వైరస్‌ కణాల్లోకి ప్రవేశించి జబ్బుపడేలా చేస్తుంది. మోడెర్నా వ్యాక్సిన్‌ ద్వారా లభించే రోగనిరోధకత ఈ స్పైక్‌ ప్రొటీన్లను విజయవంతంగా అడ్డుకొంటున్నట్లు గుర్తించారు. యాంటీబాడీల స్పందన కూడా మెరుగ్గా, వేగవంతంగా ఉంటోంది. ‘వైరస్‌ సోకినపుడు రోగనిరోధక వ్యవస్థ ఎంత త్వరగా స్పందిస్తుందన్నదే కీలకమని పలు అధ్యయనాలు తేల్చాయి. మోడెర్నా వ్యాక్సిన్‌ ఆ పాత్ర మెరుగ్గా పోషిస్తోంది’ అని పరిశోధకులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు