UN Human Rights Council: మీ నీతులు మాకొద్దు మీది విఫల దేశం 

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌ను భారత్‌ మరోసారి విమర్శలతో చీల్చిచెండాడింది. కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తినందుకుగాను

Published : 16 Sep 2021 08:50 IST

హక్కులను కాలరాస్తున్నారు 

ఐరాస మానవహక్కుల మండలిలో పాక్‌ను దునుమాడిన భారత్‌ 

దిల్లీ: ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌ను భారత్‌ మరోసారి విమర్శలతో చీల్చిచెండాడింది. కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తినందుకుగాను పదునైన మాటలతో గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్‌ను విఫల దేశంగా అభివర్ణించింది. ఉగ్రవాదానికి కేంద్రంగా ఉంటూ.. రోజూ మానవ హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాసే ఆ దేశం నుంచి నీతులు వినాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పింది. కశ్మీర్‌ విషయాన్ని ప్రస్తావించినందుకుగాను ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఓఐసీ)పైనా మండిపడింది. ఐరాస మానవహక్కుల మండలి 48వ సమావేశంలో పాక్, ఓఐసీ తాజాగా కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తాయి. దీంతో జెనీవాలోని భారత శాశ్వత మిషన్‌లో ఫస్ట్‌ సెక్రటరీగా ఉన్న పవన్‌ బఢే బుధవారం దీటుగా స్పందించారు. మానవ హక్కుల మండలి ఏర్పాటుచేసే వేదికల్లో భారత్‌పై దుష్ప్రచారానికి తెగబడటం పాక్‌కు అలవాటేనని పేర్కొన్నారు. ‘‘పాక్‌ ప్రభుత్వం తమ అధీనంలోని భూభాగాల్లో మానవ హక్కులను దారుణంగా హరిస్తోంది. దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలన్నీ ఐరాస మానవ హక్కుల మండలికి తెలుసు. భారత్‌ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అంతేకాదు హక్కుల పరిరక్షణలో ఎప్పుడూ ముందుంటుంది. ఉగ్రవాద కేంద్రంగా ఉన్న, మానవ హక్కుల హననానికి పాల్పడుతున్న పాక్‌ వంటి విఫల దేశం నుంచి మాకు పాఠాలు అక్కర్లేదు. సిక్కులు, హిందువులు, క్రైస్తవులు, అహ్మదీయులు సహా మైనారిటీలందరి హక్కులను పరిరక్షించడంలో పాక్‌ విఫలమైంది. పాక్‌లో, ఆ దేశం ఆక్రమించిన ఇతర భూభాగాల్లో వేల మంది మైనారిటీ మహిళలు, బాలికలు అపహరణలకు గురయ్యారు. బలవంతపు పెళ్లిళ్లు, మతమార్పిడుల బాధితులుగా మారారు. మతపరమైన మైనారిటీ వర్గాలపై పాక్‌ ప్రణాళికాబద్ధంగా హింసకు పాల్పడుతోంది. ఆ దేశం ఉగ్రవాదులకు బహిరంగంగానే మద్దతు పలుకుతోందని, వారికి శిక్షణనిస్తోందని, ఆయుధాలు-నిధులు సమకూరుస్తోందని ప్రపంచమంతటికీ తెలుసు. ఐరాస నిషేధిత జాబితాలోని ముష్కరులకూ పాక్‌ అండగా నిలుస్తోంది. అది వారి జాతీయ విధానం. పౌర సమాజ ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయుల అసమ్మతి గళాన్ని పాకిస్థాన్‌లో ప్రతిరోజు అణచివేస్తున్నారు’’ అని పవన్‌ పేర్కొన్నారు. భారత అంతర్గత వ్యవహారమైన కశ్మీర్‌ విషయంపై మాట్లాడేందుకు ఓఐసీకి ఎలాంటి హక్కూ లేదని ఆయన చెప్పారు. ఆ సంస్థ నిస్సహాయ స్థితిలో పాక్‌ చేతిలో బందీగా మారిందని ఎద్దేవా చేశారు.

భారత్‌లో ఆశ్రయం కోసం కొత్తగా 736 మంది అఫ్గానీల దరఖాస్తు 

భారత్‌లో ఆశ్రయం కోసం గత నెల 1 నుంచి ఈ నెల 11 వరకు దిల్లీలో తమకు కొత్తగా 736 మంది అఫ్గానీల నుంచి దరఖాస్తులు అందాయని ఐరాస శరణార్థుల హైకమిషనర్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) కార్యాలయం వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌ జాతీయులకు వీసా గడువును పొడిగించడం, వారికి ఇతర రూపాల్లో అండగా నిలవడం వంటి అంశాలపై భారత ప్రభుత్వంతో తాము ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని