Saree: చీరకట్టుతో వస్తే అవమానించారు.. ఓ రెస్టారెంటుపై మహిళ ఆరోపణ

దేశ రాజధానిలో అత్యంత విలాసవంతమైన ఓ రెస్టారెంట్‌.. వస్త్రధారణ వివాదంలో చిక్కుకుంది. చీర కట్టుతో వచ్చిన తనను లోపలికి అనుమతించలేదంటూ ఓ మహిళ ఆరోపించడం,....

Updated : 23 Sep 2021 08:21 IST

దిల్లీలో ఘటన

దిల్లీ: దేశ రాజధానిలో అత్యంత విలాసవంతమైన ఓ రెస్టారెంట్‌.. వస్త్రధారణ వివాదంలో చిక్కుకుంది. చీర కట్టుతో వచ్చిన తనను లోపలికి అనుమతించలేదంటూ ఓ మహిళ ఆరోపించడం, ఆమెకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హోరెత్తడంతో రెస్టారెంట్‌ యాజమాన్యం దిగివచ్చి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. అనితా చౌధరి అనే మహిళ దిల్లీలోని అఖ్విలా రెస్టారెంట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం అంటూ...ఫేస్‌బుక్‌లో పది సెకన్ల వీడియో  పోస్ట్‌ చేశారు. ‘‘దిల్లీలోని ఒక రెస్టారెంట్‌.. చీరను గౌరవప్రదమైన వస్త్రధారణగా గుర్తించటంలేదు. ఈ విషయంపై చాలా సమయంపాటు వాదనలు జరిగాయి. అయినా నన్ను లోపలికి అనుమతించలేదు. మనసు తీవ్రంగా గాయపడింది’’ అంటూ ఫేస్‌బుక్‌లో రాశారు. ఆమె ఆవేదన భరిత పోస్టింగ్‌ను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆ రెస్టారెంట్‌ను ఎండగట్టారు. ముందుగా సీటు రిజర్వు చేసుకోకుండా వచ్చినందునే ఆమెను అనుమతించలేదని రెస్టారెంట్‌ నిర్వాహకులు పేర్కొన్నారు. ‘ఆమె ఘర్షణకు దిగిన సందర్భంలో రెస్టారెంట్‌ డ్రెస్‌ కోడ్‌లో చీరకట్టుకు అనుమతిలేదని సిబ్బందిలో ఒకరు పొరపాటుగా అన్నారు. అందుకు క్షమాపణ చెబుతున్నామ’ని తెలిపారు. వివాదం గంట సమయంపాటు కొనసాగిందని, అందులోని పది సెకన్ల దృశ్యాన్ని మాత్రమే ఆమె పోస్టు చేసి ఘటనను వక్రీకరించారని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన వివాదాన్ని ఆ మహిళ వక్రీకరించారని పేర్కొంటూ వీడియో క్లిప్పులను విడుదల చేశారు. చీరలు ధరించి వచ్చిన వారిని లోపలికి అనుమతించిన దృశ్యాలు అందులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని