Corona: ఇండోనేసియాను చుట్టేస్తున్న ‘డెల్టా’

ఇండోనేసియాలో కరోనా కేసులు మళ్లీ ఉద్ధృతంగా పెరుగుతుండటంతో ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి....

Published : 14 Jul 2021 20:23 IST

భారత్‌ లాంటి పరిస్థితులు తలెత్తబోతున్నట్లు అంచనా

జకార్తా: ఇండోనేసియాలో కరోనా కేసులు మళ్లీ ఉద్ధృతంగా పెరుగుతుండటంపై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 47,899 కేసులు బయటపడ్డాయి. మొదట భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్‌ విస్తృతంగా వ్యాపిస్తోందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి బుది గుణాది సాదికిన్‌ పేర్కొన్నారు. అత్యంత జనసాంద్రత కలిగిన జావా ద్వీపంలో 11 ప్రాంతాల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. సుమత్రా, పాపువా, కాలిమంటన్‌తోపాటు పలు ప్రాంతాల్లో కొత్త కేసులతోపాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితులపై కఠిన పర్యవేక్షణ అవసరమని సూచించారు.

తూర్పు నుసా తెంగ్గార్రాలో మూడు రోజుల వ్యవధిలోనే కొవిడ్‌ కేసులు రెట్టింపయ్యాయి. సుమత్రాలో 86 శాతం, కాలిమంటన్‌లో 85 శాతం, దక్షిణ పాపువాలో 79 శాతం ఆసుపత్రి పడకలు నిండిపోయాయి. లాంపాంగ్‌లోని అంటువ్యాధుల నిపుణుడు ఇస్మైన్ ముఖ్తార్ మాట్లాడుతూ.. ఇండోనేసియాలో కరోనా తీవ్రరూపం దాల్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ప్రాణాలు కాపాడాలంటే ఉత్తమ ఆరోగ్య సదుపాయాలు అత్యవసరమన్నారు. అయితే వైరస్‌ను అరికట్టడం ఇంతకన్నా ముఖ్యమన్నారు. రెండో దశ కారణంగా భారత్‌లో ఏప్రిల్‌, మే నెలల్లో తలెత్తిన పరిస్థితులే.. ఇప్పుడు ఇండోనేసియాలోనూ తలెత్తే అవకాశాలున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని