Aliens: ఆ సంకేతం గ్రహాంతరవాసుల నుంచేనా?

ఖగోళశాస్త్ర పరిశోధనల్లో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సౌర కుటుంబం వెలుపల సుదూర నక్షత్రాలు వెదజల్లుతున్న రేడియో సంకేతాలను శాస్త్రవేత్తలు తొలిసారిగా పసిగట్టారు. దీన్నిబట్టి వాటి చుట్టూ గ్రహాలు దాగి ఉండొచ్చని స్పష్టమవుతోందని వారు తెలిపారు.

Updated : 13 Oct 2021 10:08 IST

వాషింగ్టన్‌: ఖగోళశాస్త్ర పరిశోధనల్లో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సౌర కుటుంబం వెలుపల సుదూర నక్షత్రాలు వెదజల్లుతున్న రేడియో సంకేతాలను శాస్త్రవేత్తలు తొలిసారిగా పసిగట్టారు. దీన్నిబట్టి వాటి చుట్టూ గ్రహాలు దాగి ఉండొచ్చని స్పష్టమవుతోందని వారు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రేడియో యాంటెన్నా ‘ద డచ్‌ లో-ఫ్రీక్వెన్సీ అరే’ (లోఫర్‌) దీన్ని పసిగట్టింది. ఇది నెదర్లాండ్స్‌లో ఉంది. సాధారణ విధానాల్లో బయటపడని గ్రహాలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. 19 ‘అరుణ మరుగుజ్జు నక్షత్రాల’ నుంచి తాజా సిగ్నళ్లను గుర్తించారు. వాటిలో నాలుగు తారల చుట్టూ గ్రహాలు ఉండొచ్చని తెలిపారు. ‘‘సౌర కుటుంబంలోని గ్రహాలు శక్తిమంతమైన రేడియో తరంగాలను వెదజల్లుతాయని మనకు తెలుసు. సౌర వాయువులు అయస్కాంత క్షేత్రాలతో చర్య జరిపినప్పుడు ఇవి ఉద్భవిస్తుంటాయి. భూమిపై అరోరాల రూపంలో ఉత్పన్నమవుతుంటాయి. అయితే సౌర కుటుంబం వెలుపలి గ్రహాల నుంచి ఈ సంకేతాలను ఇంతవరకూ గుర్తించలేదు’’ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అరుణ మరుగుజ్జు నక్షత్రాల్లో తీవ్రస్థాయి అయస్కాంత చర్యలు ఉంటాయి. ఫలితంగా సౌర జ్వాలలు, రేడియో తరంగాలు వెలువడుతుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని