Mumbai Drugs case: వాంఖడే ప్యాంటు రూ.లక్ష.. చొక్కా రూ.70 వేలు

మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై తన విమర్శలు, ఆరోపణల పర్వాన్ని మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌ మరింత ముమ్మరం చేశారు. వాంఖడే ఓసారి రూ.లక్ష ఖరీదు చేసే ప్యాంటు,

Updated : 03 Nov 2021 08:50 IST

ఆయన రూ.25-50 లక్షల విలువైన గడియారాలు ధరిస్తారు
మరిన్ని ఆరోపణలు గుప్పించిన మాలిక్‌

ముంబయి: మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై తన విమర్శలు, ఆరోపణల పర్వాన్ని మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌ మరింత ముమ్మరం చేశారు. వాంఖడే ఓసారి రూ.లక్ష ఖరీదు చేసే ప్యాంటు, రూ.70 వేల విలువైన చొక్కా ధరించారని పేర్కొన్నారు. ఆయన రూ.25-50 లక్షల విలువ చేసే గడియారాలు పెట్టుకుంటుంటారనీ చెప్పారు. నిజాయతీపరులైన అధికారులెవరైనా అంతటి ఖరీదైనవి ధరించగలరా అని ప్రశ్నించారు. బెదిరింపులు, బలవంతపు వసూళ్ల కోసం వాంఖడే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకున్నారని ఆరోపించారు. తద్వారా రూ.కోట్లు గడిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆరోపించారు. ముంబయిలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు పలు అంశాలపై మాట్లాడారు.

‘డ్రగ్స్‌ వ్యాపారితో వాంఖడే సోదరి వాట్సప్‌ సంభాషణలు’

మాదకద్రవ్యాలను విక్రయించే ఓ వ్యాపారితో సమీర్‌ వాంఖడే సోదరి యాస్మీన్‌ వాట్సప్‌ సంభాషణలు జరిపారని మాలిక్‌ పేర్కొన్నారు. సంబంధిత స్క్రీన్‌షాట్లను ట్విటర్‌ వేదికగా బయటపెట్టారు. డ్రగ్స్‌ వ్యాపారి యాస్మిన్‌ను చిరునామా కోరగా, ఆమె సంబంధిత వివరాలను పంపినట్లు వాటిలో ఉంది.

దేశ్‌ముఖ్‌ అరెస్టు రాజకీయ ప్రేరేపితం

అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్టు రాజకీయ ప్రేరేపితమని నవాబ్‌ మాలిక్‌ విమర్శించారు. రాష్ట్రంలో మహావికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వంలోని నేతల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే కేంద్ర సర్కారు ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

తోసిపుచ్చిన వాంఖడే

ఖరీదైన దుస్తులు, గడియారాలు ధరిస్తారంటూ తనపై నవాబ్‌ మాలిక్‌ చేసిన ఆరోపణలను సమీర్‌ వాంఖడే తోసిపుచ్చారు. అలాంటివి తానెప్పుడూ వేసుకోలేదన్నారు. తనను, తన కుటుంబాన్ని లొంగదీసుకునేందుకు గతంలో అనేక మంది వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేశారని, వాటన్నింటినీ తాము సమర్థంగా తిప్పికొట్టామని పేర్కొన్నారు.

న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: యాస్మీన్‌

డ్రగ్స్‌ వ్యాపారితో తన వాట్సప్‌ సంభాషణలుగా పేర్కొంటూ మాలిక్‌ విడుదల చేసిన స్క్రీన్‌షాట్లపై యాస్మీన్‌ స్పందించారు. ఉద్దేశపూర్వకంగా మధ్యమధ్యలో పలు వాక్యాలను తొలగించి, కొన్నింటిని మాత్రమే ఆయన బయటపెట్టారని ఆరోపించారు. న్యాయపరమైన సహాయం కావాలంటూ ఓ వ్యక్తి వాట్సప్‌లో తనను కోరడంతో.. తాను చిరునామా పంపాల్సి వచ్చిందని వివరించారు. మాలిక్‌ చర్యతో తన పరువుకు భంగం కలిగిందని, ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని