
మనిషికి పంది కిడ్నీ.. విజయవంతంగా అవయవ మార్పిడి
న్యూయార్క్: అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయం లిఖించారు అమెరికా శాస్త్రవేత్తలు! పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి విజయవంతంగా అమర్చారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేయడం విశేషం. అవయవాల కొరతను అధిగమించడంలో ఈ పరిశోధనను కీలక ముందడుగుగా భావిస్తున్నారు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు... మెదడు పనిచేయడం ఆగిపోయిన ఓ వ్యక్తిపై గతనెలలో అవయవ మార్పిడి ప్రయోగం చేపట్టారు. పంది మూత్రపిండాన్ని అతనికి అమర్చి, మూడు రోజులపాటు దాని పనితీరును పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని శస్త్రచికిత్స నిర్వహించిన డా.రాబర్డ్ మోంట్గోమెరి తెలిపారు. నిజానికి పంది కణాల్లోని గ్లూకోజ్ మనిషి శరీర వ్యవస్థకు సరిపోలదు. దీంతో మనిషి రోగనిరోధక వ్యవస్థ ఈ అవయవాలను తిరస్కరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎన్‌వైయూ శాస్త్రవేత్తలు... జన్యు సవరణలు చేసిన పంది నుంచి అవయవాన్ని సేకరించారు. దాని కణాల్లో చక్కెర స్థాయిలను తగ్గించి, మనిషి రోగ నిరోధక వ్యవస్థ తృణీకరించకుండా కొన్ని మార్పులు చేశారు. తర్వాత ఆ మూత్రపిండాన్ని మనిషికి అమర్చారు.