Published : 11 Nov 2021 11:14 IST

Ethanol: ఇథనాల్‌ వినియోగానికి ప్రాధాన్యం

పెట్రోలులో దీని మిశ్రమాన్ని 20 శాతం పెంపునకు కేంద్రం నిర్ణయం 
ఆర్థిక లాభం కంటే పర్యావరణ ప్రయోజనాలే అధికం

ఈనాడు, దిల్లీ: పర్యావరణ అనుకూల ఇథనాల్‌ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. పెట్రోలులో ఇథనాల్‌ మిశ్రమాన్ని 2025 నాటికల్లా 20 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. ప్రస్తుతం 332 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను పెట్రోలులో కలుపుతుండగా, దాన్ని 2025-26 నాటికి 1,016 కోట్ల లీటర్లకు తీసుకెళ్లాలని సర్కారు లక్ష్యం పెట్టుకొంది. దీన్ని చేరుకోవాలంటే ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 426 కోట్ల లీటర్ల నుంచి 1,500 కోట్ల లీటర్లకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందులో ఆహార గింజల ద్వారా 740 కోట్ల లీటర్లు, చెరకు ఆధారంగా మరో 760 కోట్ల లీటర్లను ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని నీతి ఆయోగ్‌ ఇప్పటికే అంచనా వేసింది.

1.5% నుంచి మొదలై...

2014లో సగటున 1.5% మేర ఇథనాల్‌ను పెట్రోలులో కలుపుతుండగా, ఇప్పుడు అది 8.5 శాతానికి చేరింది. 2022 నాటికి దీన్ని 10 శాతానికి, 2025 నాటికి 20 శాతానికి పెంచాలన్నది తాజా లక్ష్యం.ఇప్పటివరకూ చెరకు అధికంగా పండే నాలుగైదు రాష్ట్రాల్లోనే ఇథనాల్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. ముక్కిపోయిన ఆహార గింజలతో దీన్ని ఉత్పత్తిచేసే ఇస్టిలరీస్‌ను దేశవ్యాప్తంగా నెలకొల్పాలని ప్రభుత్వం యోచించింది. ఈ క్రమంలోనే తాజాగా ఇథనాల్‌ ధరలను పెంచింది. షుగర్‌జ్యూస్, సిరప్‌ల నుంచి లీటరు ఇథనాల్‌ తయారీకి రూ.62.55, బి-హెవీకి రూ.57.61, సి-హెవీకి రూ.45.69; వ్యర్థ ఆహారగింజల నుంచి దీన్ని ఉత్పత్తి చేయడానికి రూ.51.55, మిగులు బియ్యం నుంచి తయారీకి రూ.56.87 ఖర్చవుతుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. పంట ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నందున దేశంలో ఇథనాల్‌ ధర మిగిలిన దేశాల కంటే అధికంగానే ఉంటోంది. ఇదే సమయంలో పన్నులు లేకుండా లీటరు పెట్రోలు రూ.42, డీజిల్‌ రూ.43కి లభిస్తోంది. వీటితో పోలిస్తే ఇథనాల్‌ ధర ఎక్కువే. ఇథనాల్‌ మీద జీఎస్‌టీ అమలు చేస్తున్నందున లీటరుపై రూ.2.28 నుంచి రూ.3.13 వరకు పన్ను వర్తిస్తుంది. ఇదే సమయంలో పెట్రోలు మీద లీటరుకు ఎక్సైజ్‌ డ్యూటీ రూ.27.98 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం పెట్రోలులో 332 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కలపడం వల్ల ఆ మేరకు పెట్రోలియం వాడకం తగ్గుతోంది. ఫలితంగా ప్రభుత్వం ఏటా రూ.9,289 కోట్ల మేర ఎక్సైజ్‌డ్యూటీ కోల్పోవాల్సి వస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఇవీ ప్రయోజనాలు...

ఇథనాల్‌ మూలకాల్లో ఉండే ఆక్సిజన్‌.. పెట్రోలును పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ఇంజిన్‌కు దోహదపడుతుంది. ఫలితంగా కర్బన ఉద్గారాలు, కాలుష్యం తగ్గుతాయి.

20% ఇథనాల్‌ మిశ్రమాన్ని పెట్రోలులో కలిపితే నాలుగు చక్రాల వాహనాల నుంచి వెలువడే కార్బన్‌ మోనాక్సైడ్‌ 30%, హైడ్రోకార్బన్స్‌ 20% తగ్గుతాయని అంచనా. 

ఇథనాల్‌ ఉత్పత్తి ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. 

పెట్రోలులో 20% ఇథనాల్‌ను కలపడం వల్ల ఏటా రూ.30 వేల కోట్ల విలువైన ముడిచమురు దిగుమతులు తగ్గుతాయి.

ఇథనాల్‌ వినియోగం వల్ల ఆర్థిక ప్రయోజనాల కంటే పర్యావరణపరంగా కలిగే మేలే అధికం.

ఇంజిన్‌ భారం వినియోగదారులపైనే

దేశంలో ప్రస్తుత వాహన ఇంజిన్లు 5% ఇథనాల్‌ కలిపిన ఇంధనాన్ని వాడటానికే సరిపోతాయి. అంతకుమించితే, వాహనాల మైలేజీ తగ్గిపోతుంది. లేదంటే, ఇథనాల్‌ మిశ్రమం అధికంగా ఉండే ఇంధనాన్ని వినియోగించుకునేలా ఇంజిన్లను మార్చుకోవాలి. ఇలాంటి ‘ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌-ఇంజిన్‌’ ఉండే నాలుగు చక్రాల వాహనాల ధర రూ.17వేలు-రూ.25 వేల వరకూ, ద్విచక్ర వాహనాల ధర రూ.5వేలు-రూ.12 వేల వరకూ అధికంగా ఉంటున్నాయి. ఈ భారాన్ని వినియోగదారుడే భరించాలి. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని