Trump: ట్రంప్‌ మ్యాజిక్‌.. కొత్త సోషల్‌ మీడియా కంపెనీతో కాసుల వర్షం!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సరికొత్త సామాజిక మాధ్యమంతో

Updated : 28 Oct 2021 10:47 IST

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సరికొత్త సామాజిక మాధ్యమంతో భారీగా ఆర్జించనున్నారు. సంస్థ పనితీరు మెరుగ్గా ఉంటే స్పెషల్‌ బోనస్‌ షేర్ల కింద వందల కోట్లు వెనకేసుకునే అవకాశం ఉంది. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌(టీఎంటీజీ) పేరుతో తన కొత్త సంస్థను మాజీ అధ్యక్షుడు గత వారం ప్రకటించారు. ‘ట్రూత్‌ సోషల్‌’ పేరుతో మెసేజింగ్‌ యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కంపెనీ ట్విటర్, ఫేస్‌బుక్‌ సంస్థలకు పోటీ ఇవ్వనుంది. వారెంట్‌ కన్‌వర్టబుల్‌ ద్వారా ఈ సంస్థ.. వచ్చే మూడేళ్లలో 40 మిలియన్‌ షేర్లను సృష్టించనుంది. ఈ మూడేళ్లలో సంస్థ షేరు ఏ మేరకు రాణిస్తుందనే అంశంపై.. షేర్ల మొత్తం సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఒక షేరు కనీసం 30 డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ ట్రేడింగ్‌ చేస్తే.. వారెంట్‌ కన్‌వర్టబుల్‌ 40 మిలియన్‌ షేర్లుగా మారే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ సంస్థకు దాదాపు 90 మిలియన్‌ బోనస్‌ షేర్లు లభించే అవకాశం ఉంది. వీటి విలువ వేల కోట్లకు పైగా ఉంటుందని సెక్యూరిటీ రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా వెల్లడైంది. ప్రస్తుత ధరల ప్రకారం ట్రంప్‌ కంపెనీకి బోనస్‌ షేర్లు జారీ చేస్తే వాటి విలువ 2.4 బిలియన్‌ డాలర్లు (రూ.17,990కోట్లు)అవుతుంది. బోనస్‌ షేర్లకు అదనంగా కంపెనీ విలీనం ద్వారా మరో 87 మిలియన్ల షేర్లు ట్రంప్‌ సంస్థ సొంతమవుతాయి. వీటి విలువ సుమారు 5.1 బిలియన్‌ డాలర్లు (రూ.38,230 కోట్లు) ఉంటుంది. అయితే, ట్రంప్‌ విలీనం చేయాలనుకుంటున్న కంపెనీల షేర్లు అనిశ్చితికి గురికావడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని