Afghanistan: ‘ఘనీ బాబా పారిపోయారు.. ఆ దేశద్రోహికి శిక్ష తప్పదు’

అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్గానిస్థాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు ఎట్టకేలకు దేశాన్ని తమ వశం చేసుకున్నారు. దీంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ పలాయనం చిత్తగించారు.

Published : 16 Aug 2021 10:31 IST

అఫ్గాన్‌ ఎంబసీ ట్విటర్‌ ఖాతాలో అనుచిత ట్వీట్‌

అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందన్న అధికారులు

దిల్లీ: అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్గానిస్థాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు ఎట్టకేలకు దేశాన్ని తమ వశం చేసుకున్నారు. దీంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ పలాయనం చిత్తగించారు. దీంతో యుద్ధం ముగిసిందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ పరిణామాల అనంతరం కొద్ది గంటల తర్వాత భారత్‌లోని అఫ్గాన్‌ ఎంబసీ అధికారిక ట్విటర్‌ ఖాతా నుంచి ఓ అనుచిత ట్వీట్‌ వచ్చింది. అందులో అష్రాఫ్‌పై ఘాటు విమర్శలు ఉన్నాయి. దేశద్రోహి అని, ఆయనకు సేవ చేసినందుకు సిగ్గుపడుతున్నామని అందులో రాసుకొచ్చారు. అయితే ఆ ట్వీట్‌ తాము చేయలేదని, తమ ఖాతా హ్యాక్‌ అయ్యిందని ఎంబసీ అధికారులు వెల్లడించారు.

‘‘మేం సిగ్గుతో తలబాదుకుంటున్నాం. ఘనీ బాబా(అష్రాఫ్‌ గనీ) తన సన్నిహితులతో కలిసి దేశం విడిచి పారిపోయారు. అలాంటి వ్యక్తికి సేవ చేసినందుకు మమ్మల్ని క్షమించండి. ఆ దేశద్రోహిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. ఆయన పాలన మన దేశ చరిత్రలో ఓ మరక’’ అని ఆ ట్వీట్‌లో రాశారు. అయితే కొద్ది సేపటికే ఆ ట్వీట్‌ డిలీట్‌ అయ్యింది.

అయితే తమ ట్విటర్‌ ఖాతాను హ్యాక్‌ చేశారని కొద్ది గంటల తర్వాత అఫ్గాన్‌ ఎంబసీ మీడియా కార్యదర్శి అబ్దుల్‌హక్‌ ఆజాద్‌ వెల్లడించారు. ‘‘భారత్‌లోని అఫ్గాన్‌ ఎంబసీ ట్విటర్‌ ఖాతాకు నేను యాక్సెస్‌ కోల్పోయాను. వైరల్‌ అయిన ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌ను నా ఫ్రెండ్‌ ఒకరు నాకు పంపించారు. అప్పుడు నేను లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించాను గానీ నాకు యాక్సెస్‌ రాలేదు. మా అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారు’’ అని అబ్దుల్‌హక్‌ పేర్కొన్నారు.

భారత్‌ అధ్యక్షతన ఐరాస అత్యవసర భేటీ

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడంపై ఐక్యరాజ్యసమితి భద్రత మండలి(యూఎన్‌ఎస్‌సీ) నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. సోమవారం రాత్రి 7.30 గంటలకు భారత్‌ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై ఇందులో చర్చించనున్నారు. అఫ్గాన్‌ పౌరుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐరాస నిర్ణయించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని