Afghanistan: దేశం పెను ప్రమాదంలో ఉంది.. కానీ కాపాడుకుంటాం..!

అఫ్గానిస్థాన్‌ ప్రస్తుతం తీవ్రమైన అస్థిరత్వ పరిస్థితుల్లో ఉందని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ అన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకుంటామని,

Published : 14 Aug 2021 15:47 IST

తాలిబన్‌ ఆక్రమణల నేపథ్యంలో అఫ్గాన్‌ అధ్యక్షుడు ఘనీ ప్రకటన

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ ప్రస్తుతం తీవ్రమైన అస్థిరత్వ పరిస్థితుల్లో ఉందని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ఆందోళన వ్యక్తంచేశారు. అయితే ఈ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకుంటామని, ఇందుకోసం అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అఫ్గాన్‌లో తాలిబన్లు పేట్రేగిపోయిన నేపథ్యంలో అధ్యక్షుడు ఘనీ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో నేడు ఆయన తమ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

‘‘మీ అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నా.. అస్థిరత్వాన్ని నివారించడం, హింసను అడ్డుకోవడం వంటివాటిపై దృష్టిపెట్టాను. అఫ్గాన్‌ ప్రజలపై యుద్ధాన్ని ప్రకటించడాన్ని నేను అంగీకరించను. గత 20ఏళ్లుగా సాధించిన లక్ష్యాలను కోల్పోవడానికి సిద్ధంగా లేను. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సహించలేను. ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గాన్‌ భద్రత బలగాలను తిరిగి సమాయత్తం చేయడమే మా ప్రధమ ప్రాధాన్యం. దీనికి సంబంధించి కీలక చర్యలు చేపడుతున్నాం. ఇందుకోసం స్థానిక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, అంతర్జాతీయ సమాజంతో విస్తృత సంప్రదింపులు ప్రారంభించాం. సమస్య పరిష్కారం కోసం,. అఫ్గాన్‌లో శాంతిని నెలకొల్పడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం’’ అని ఘనీ చెప్పుకొచ్చారు.

అఫ్గానిస్థాన్‌లో అమెరికా తమ దళాలను ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. గత కొన్ని రోజులుగా దురాక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే రెండొంతుల దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్న తాలిబన్లు.. రాజధాని కాబూల్‌ను కూడా చుట్టుముట్టారు. అధ్యక్షుడు ఘనీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఘనీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని కుటుంబంతో సహా దేశం విడిచి వెళ్లనున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వీడియో సందేశం విడుదల చేసిన ఘనీ.. రాజీనామా వార్తల గురించి స్పందించలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని