United Nations: ఐరాస వేదికపై.. అఫ్గాన్‌, మయన్మార్‌లకు లభించని చోటు!

ప్రపంచ దేశాలు ఒకే వేదికపై వచ్చే ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశాల్లో అఫ్గానిస్థాన్‌, మయన్మార్‌లకు చుక్కెదురైంది.

Published : 27 Sep 2021 20:34 IST

ప్రసంగ జాబితాలో లేవని ఐరాస అధికారుల వెల్లడి

న్యూయార్క్‌: ప్రపంచ దేశాలు ఒకే వేదికపై వచ్చే ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశాల్లో అఫ్గానిస్థాన్‌, మయన్మార్‌లకు చుక్కెదురైంది. సర్వసభ్య సమావేశాల చివరి రోజు ఆ రెండు దేశాలు ప్రసంగించే అవకాశం లేదని ఐరాస అధికారులు వెల్లడించారు. 76వ వార్షిక సమావేశాల్లో ప్రసంగించే జాబితాలో ఆ రెండు దేశాల పేర్లు లేవని స్పష్టం చేశారు.

ఐరాస వార్షిక సమావేశాల్లో భాగంగా ప్రపంచ దేశాల నేతలు సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తుండగా.. అఫ్గానిస్థాన్‌ విషయంలో అనిశ్చితి నెలకొంది. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు తాలిబన్లు ప్రకటించినప్పటికీ ఇంతవరకూ వారికి అంతర్జాతీయ గుర్తుంపు రాలేదనే చెప్పవచ్చు. అఫ్గాన్‌ తరపున అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వం నియమించిన గులామ్‌ ఎం ఇసాక్జాయ్‌ ప్రతినిధిగా ఉన్నారు. సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనూ అఫ్గాన్‌ తరపున ప్రసంగ జాబితాలో ఆయన పేరుంది. అదే సయమంలో అఫ్గాన్‌ తరపున తాము నియమించిన ప్రతినిధికి ఐరాస వేదికపై మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతూ ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌కు తాలిబన్లు లేఖ రాశారు. దీంతో వీరిలో ఎవరిని గుర్తించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది.

ఇక మయన్మార్‌లోనూ ఇదే పరిస్థితి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అంగ్‌ సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని పడగొట్టి ఫిబ్రవరి 1న పాలనను సైన్యం తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటివరకు ఐరాసలో మయన్మార్‌ ప్రతినిధిగా ఉన్న క్యావ్‌ మోయ్‌ను తొలగిస్తున్నట్లు సైన్యం పేర్కొంది. వారి ప్రతినిధిగా అనుగ్‌ థురైన్‌ను గుర్తించాలంటూ ఐరాస సెక్రటరీ జనరల్‌కు ఇదివరకే లేఖ రాసింది. అయితే, ఈ అభ్యర్థన లేఖలపై ఐరాస ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిపై ఐరాస కమిటీ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. సమావేశాలు ప్రారంభమైనందున ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లభించదని తెలుస్తోంది. అందుకే ఈ రెండు దేశాలకు ప్రస్తుత వార్షిక సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించే అవకాశం లభించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని