Afghanistan: తాలిబన్ల ఆక్రమణ.. భారత్‌కు హాని.. పాక్‌కు ప్రయోజనం!

తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకోవడం భారత్‌కు మంచి పరిణామం కాదని.. అది హాని కలిగించే విషయమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు.

Published : 08 Sep 2021 01:13 IST

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

లఖ్‌నవూ: తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకోవడం భారత్‌కు మంచి పరిణామం కాదని.. అది హాని కలిగించే విషయమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. దానివల్ల కేవలం పాకిస్థాన్‌కే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ఒవైసీ.. అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు.. అందుకు పాకిస్థాన్‌ సహకరిస్తోన్న తీరుపై స్పందించారు.

‘అఫ్గానిస్థాన్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్‌ దాదాపు రూ.35వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్నారు. అఫ్గాన్‌లో జరుగుతున్న మార్పులు భారత్‌కు మంచివి కావు.’ అని తాలిబన్ల ఆక్రమణపై అడిగిన ప్రశ్నకు అసదుద్దీన్‌ ఒవైసీ ఈవిధమైన సమాధానమిచ్చారు. ప్రస్తుతం అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం పాకిస్థాన్‌కే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయని అన్నారు. అయితే, రెండు రోజుల క్రితం వీటిపై మాట్లాడిన ఒవైసీ.. తాలిబన్లను భారత్ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తుందా? లేదా? అంటూ ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి కాస్త ఆదరణ లభించగా.. పశ్చిమబెంగాల్‌లో మాత్రం చతికిలపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఎంఐఎం దృష్టిసారించింది. ఇందులో భాగంగా స్థానిక పార్టీలతో కలిసి పోటీచేసే అంశంపైనా చర్చలు జరుపుతోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇతర పార్టీలకు చెందిన నాయకులను, ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తాజాగా మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌తోపాటు ఆయన భార్య ఎంఐఎం పార్టీలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు