Corona: మళ్లీ బుసకొడుతోన్న కరోనా.. ఆంక్షల చట్రంలోకి ప్రపంచ దేశాలు..!

ప్రపంచ దేశాలు మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంటున్నాయి. రికార్డు స్థాయి మరణాలతో రష్యా అల్లాడిపోతోంది. గంటల వ్యవధిలో భారీగా కేసులు పెరగడంతో సింగపూర్ ఉలిక్కిపడింది. జీరో టోలరెన్స్‌ పాలసీ అనుసరిస్తోన్న చైనా పదుల సంఖ్యలో వస్తోన్న కేసులను కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. దాంతో పలు దేశాలు కొవిడ్ ఆంక్షల్ని కఠినతరం చేస్తున్నాయి. మరికొన్ని ఆంక్షల ఛట్రంలోకి వెళ్లిపోతున్నాయి.

Updated : 28 Oct 2021 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రపంచ దేశాలు మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంటున్నాయి. రికార్డు స్థాయి మరణాలతో రష్యా అల్లాడిపోతోంది. గంటల వ్యవధిలో భారీగా కేసులు పెరగడంతో సింగపూర్ ఉలిక్కిపడింది. జీరో టోలరెన్స్‌ పాలసీ అనుసరిస్తోన్న చైనా పదుల సంఖ్యలో వస్తోన్న కేసులను కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. దాంతో పలు దేశాలు కొవిడ్ ఆంక్షల్ని కఠినతరం చేస్తున్నాయి. మరికొన్ని ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.

 రికార్డు స్థాయిలో వైరస్ వ్యాప్తి.. మాస్కోలో లాక్‌డౌన్‌:

రష్యాలో కరోనా రికార్డు స్థాయిలో విజృంభిస్తోంది. దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు, మరణాలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం 1,159 మరణాలు వెలుగుచూశాయి. దాంతో మొత్తం మృతుల సంఖ్య 2.3 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 83 లక్షలకు పైగా కేసులు వచ్చాయి. దాంతో అప్రమత్తమైన రష్యా ప్రభుత్వం దేశరాజధాని మాస్కోలో గురువారం నుంచి 11 రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేస్తూ పుతిన్‌ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకోపక్క, దేశంలో అభివృద్ధి చెందిన స్పుత్నిక్ టీకాపై అక్కడి ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ప్రజలు మాత్రం టీకా వేయించుకునే విషయంలో ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించలేదు. కేవలం 32 శాతం మంది మాత్రమే పూర్తిగా టీకాలు పొందారు.  

చైనాలో యుద్ధ వాతావరణ పరిస్థితులు..

కరోనా కట్టడికి  జోరో టోలరెన్స్ పాలసీని అనుసరిస్తోన్న చైనా.. దేశీయంగా పదుల సంఖ్యలో వెలుగుచూస్తున్న కేసులకే కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈశాన్య చైనా సరిహద్దుల్లో కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసింది. రష్యాతో సరిహద్దు కలిగి ఉన్న ఆ ప్రాంతాల విషయంలో మరీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆరు లక్షల మంది ఉన్న అక్కడి హీలాంగ్జియాంగ్ నగరంలో లాక్‌డౌన్ విధించింది. ఇప్పటికే లాంగ్జౌ, ఎజిన్‌ ప్రాంతంలో లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఒక్క కేసు వచ్చినా అక్కడి నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఇక, ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా పరిమితులు విధించింది. నిఘా పెంచడంతో కొన్ని ప్రాంతాల్లో యుద్ధానికి ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయి. బుధవారం స్థానికంగా 23 మందికి కరోనా సోకింది. అక్టోబర్ 17 నుంచి ఆ సంఖ్య 270 కి చేరింది. ఫిబ్రవరిలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌ కూడా చైనా కఠిన వైఖరికి కారణమవుతోంది.  

సింగపూర్‌కు ఏమైంది.. 

సింగపూర్‌లో రోజూవారీ కేసులు మొదటిసారి 5 వేల మార్కును దాటాయి. 24 గంటల వ్యవధి కంటే ముందే కొన్ని గంటల్లోనే ఈ స్థాయిలో కేసులు పెరగడంపై అక్కడి ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. బుధవారం మధ్యాహ్నం 12 కల్లా 5,324 మందికి కరోనా సోకింది. ‘ఈ రోజు ఇన్ఫెక్షన్ల సంఖ్య అసాధారణంగా చాలా ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం కొన్ని గంటల్లోనే ల్యాబుల్లో ఈ పాజిటివ్‌ కేసుల్ని గుర్తించాం. అందుకు గల కారణాల్ని అన్వేషిస్తున్నాం’ అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

బ్రిటన్‌లో కూడా డెల్టా ఉపరకం ay.4.2 కలవరం పుట్టిస్తోంది. అదే రకం భారత్‌లో కూడా వెలుగుచూసింది. మన దేశంలో ఆ రకానికి చెందిన 17 కేసుల్ని గుర్తించారు. రెండో వేవ్ ముగుస్తున్నప్పటి నుంచే మూడో వేవ్‌ గురించి ఆందోళనలు వెలువడ్డాయి. అయితే ఇటీవల కాలంలో కేసులు తగ్గడంతో  ప్రజల్లో ఉదాసీనత కనిపిస్తోంది. అయితే పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండకపోతే.. ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం కూడా కొవిడ్ మార్గదర్శకాలను నవంబర్ 30 వరకు పెంచుతూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని