AIIMS: ‘వెంటనే విధుల్లో చేరండి’: సిబ్బందికి సెలవులు రద్దు చేసిన ఎయిమ్స్‌

దిల్లీలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. 80 శాతానికి పైగా నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తరుణంలో.. దిల్లీ ఎయిమ్స్ అప్రమత్తమైంది.

Updated : 04 Jan 2022 14:52 IST

దిల్లీ: దిల్లీలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. 80 శాతానికి పైగా నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తరుణంలో.. దిల్లీ ఎయిమ్స్ అప్రమత్తమైంది. వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూసుకునేందుకు సిబ్బందికి శీతకాలం సెలవుల్ని రద్దు చేసింది. వెంటనే అందరూ విధుల్లో చేరాలని ఆదేశించింది. దిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ దేశ రాజధానిలో వారాంతపు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎయిమ్స్ నుంచి ఈ  ప్రకటన వెలువడింది. కొవిడ్ కారణంగా రెండు మూడు రోజుల వ్యవధిలో ఆసుపత్రిలో 50 మంది బాధితులు చేరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఒమిక్రాన్‌ వ్యాప్తితో దిల్లీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే అక్కడ 4వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 6.46 శాతానికి చేరింది. గతేడాది మే తర్వాత పాజిటివిటీ రేటు ఈ స్థాయికి పెరగడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. దిల్లీలో వచ్చే వారం నాటికి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంతం నాటికి రోజుకు 8-9 వేల కేసులు నమోదవ్వొచ్చని అంటున్నాయి. జనవరి 15 నాటికి రోజువారి కేసులు 20వేల నుంచి 25వేలకు పెరిగే అవకాశముందని, ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరుగుతాయని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేసుల పెరుగుదలకు డెల్టా, ఒమిక్రాన్‌.. రెండు వేరియంట్లు కారణమని తెలిపాయి. గత రెండు రోజులుగా ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరగడం ఆందోళనలకు గురిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని