
వాయు కాలుష్యంతో ఏటా 70లక్షల మంది బలి.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70లక్షల అకాల మరణాలకు గాలి కాలుష్యం కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి స్పష్టం చేసింది. మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ ముప్పులో గాలి కాలుష్యం అతిపెద్దదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు అవసరమని గుర్తుచేసిన డబ్ల్యూహెచ్‌వో.. మరోసారి గాలి నాణ్యత మార్గదర్శకాలను కఠినతరం చేసింది.
వాతావరణ మార్పులతో పాటు మానవ ఆరోగ్యానికి గాలి కాలుష్యం అతిపెద్ద పర్యావరణ ముప్పుగా మారిందని అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గాలి నాణ్యతను పెంచడం వల్ల వాతావరణ మార్పులను కొంతవరకు నియంత్రించవచ్చని అభిప్రాయపడింది. కాలుష్య ప్రభావం కేవలం ఏ ఒక్క దేశానికో, ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని.. అందుకే ప్రపంచ దేశాలు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది.
గాలి కాలుష్యం తగ్గించడంలో భాగంగా గాలి నాణ్యత ప్రమాణాలను (AQG) ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో రూపొందించింది. అవి రూపొందించి 16ఏళ్ల గడుస్తోంది. ప్రస్తుతం విడుదలవుతున్న ఉద్గారాలు, ఆరోగ్యంపై గాలి కాలుష్యం ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వాటిని కఠినతరం చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను సవరించింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12వరకు గ్లాస్గోలో జరిగే ప్రపంచ పర్యావరణ సదస్సు-COP26 నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.