OBC Bill: ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు.. ఆందోళన చేయబోమన్న నేతలు

పెగాసస్‌ సహా పలు అంశాలపై ఆందోళనలు చేస్తూ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు.. ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి.

Updated : 09 Aug 2021 11:55 IST

దిల్లీ: పెగాసస్‌ సహా పలు అంశాలపై ఆందోళనలు చేస్తూ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు.. ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం నేడు ప్రవేశపెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని వెల్లడించాయి. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందుకే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు విపక్ష నేతలు చెప్పారు. 

రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. కాగా.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓబీసీల మద్దతు సంపాదించుకోవడం కోసమే భాజపా కేంద్ర నాయకత్వం వ్యూహాత్మకంగా ఈ బిల్లును తీసుకొస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మళ్లీ వాయిదాల పర్వం..

పార్లమెంట్‌లో సోమవారం కూడా వాయిదాల పర్వం మొదలైంది. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన లేవనెత్తాయి. దీంతో కొద్ది నిమిషాలకే సభ అరగంటపాటు వాయిదా పడింది. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు మళ్లీ మొదలైనా విపక్షాల నిరసనలు ఆగలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. ఫోన్ల హ్యాకింగ్‌పై చర్చ జరపాలని పట్టుబడుతోన్న విపక్ష నేతలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

ఒలింపిక్‌ విజేతలకు అభినందనలు..

అంతకు ముందు టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు నీరజ్‌ చోప్రా, బజరంగ్‌ పునియా, పీవీ సింధు, లవ్లీనా, మీరాబాయి చాను, రవి దహియా, హాకీ జట్టు క్రీడాకారులకు ఉభయ సభలు అభినందనలు తెలిపాయి. నేడు క్విట్‌ ఇండియా ఉద్యమ రోజును పురస్కరించుకుని భారత స్వాతంత్ర్య సమరంలో ప్రాణత్యాగం చేసిన వారికి ఉభయ సభలు నివాళులర్పించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని