Hyperloop: భారత్‌లో హైపర్‌లూప్‌.. నీతి ఆయోగ్‌ ఏం చెబుతోందంటే?

అత్యంత వేగంగా ప్రయాణం చేయగల సౌలభ్యమున్న హైపర్‌లూప్‌ (Hyperloop) సాంకేతికతను స్వయంగా డిజైన్‌ చేసుకునే సామర్థ్యం భారత్‌కు ఉందని నీతిఆయోగ్‌ సభ్యుడు వి.కె.సారస్వత్‌ పేర్కొన్నారు.

Updated : 14 Nov 2021 22:24 IST

దిల్లీ: అత్యంత వేగంగా ప్రయాణం చేయగల సౌలభ్యమున్న హైపర్‌లూప్‌ (Hyperloop) సాంకేతికతను స్వయంగా డిజైన్‌ చేసుకునే సామర్థ్యం భారత్‌కు ఉందని నీతిఆయోగ్‌ సభ్యుడు వి.కె.సారస్వత్‌ పేర్కొన్నారు. అయితే, ఇందుకు సుదీర్ఘ సమయం పడుతున్నందున ఈ టెక్నాలజీ పనితీరును పరిశీలించేందుకు విదేశీ కంపెనీలకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. వీటిపై సొంత డిజైన్‌ల కోసం పరిశోధనాభివృద్ధి (R&D) చేసే సత్తా భారత్‌కు ఉందన్న ఆయన.. వీటిపై భద్రత కూడా ప్రధాన సమస్య అయినందున భారత్‌ కూడా స్వయంగా నియంత్రణ యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

కొత్తతరం రవాణా వ్యవస్థ ‘హైపర్‌లూప్‌’ టెక్నాలజీపై ముమ్మర ప్రయోగాలు చేస్తోన్న వర్జిన్‌ సంస్థ.. భారత్‌లోనూ సాకారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ ప్రాజెక్టును భారత్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రయోగాత్మకంగా వీటిని పరిశీలించేందుకు వర్జిన్‌ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. ఇదే సమయంలో ఈ టెక్నాలజీతో ప్రయోజనాలు, సాధ్యాసాధ్యాలపై నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్‌ నేతృత్వంలోనే ఓ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో హైపర్‌లూప్‌ ప్రయోగాలకు ఆసక్తి చూపుతోన్న కంపెనీలకు అనుమతి ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అయితే, నిపుణుల కమిటీ దీనిపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

ఇక హైపర్‌లూప్‌ అనేది కొత్త తరం రవాణా వ్యవస్థ. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సౌలభ్యముండే ఈ వ్యవస్థలో మెట్రోరైలు బోగీల్లా ఉండే పాడ్‌లు లేదా క్యాప్స్యూల్స్‌ ఉంటాయి. తక్కువ పీడనం ఉన్న గొట్టాల్లో పయణించే క్యాప్స్యూల్స్‌ను స్తంభాలపై కానీ భూగర్భంలో కానీ ఏర్పాటు చేయవచ్చు. ఈ వ్యవస్థ మొత్తం స్వయంచోదితం కావడంతో డ్రైవర్‌ సంబంధ పొరపాట్లు ఉండవని నిపుణులు చెబుతున్నారు. వర్జిన్‌ సంస్థ ఇప్పటికే వీటి ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించింది. అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో ఉన్న ‘డెవ్‌లూప్‌ ప్రయోగ కేంద్రం’లో గతేడాది నవంబర్‌లో జరిపిన పరీక్షలో ఈ ప్రత్యేక వాహనం 15సెకన్లలోనే 500 మీటర్లు దూసుకెళ్లింది. దాదాపు గంటకు 172 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకున్నట్లు వర్జిన్‌ సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని