Punjab Congress: చేతులు కలిపిన కెప్టెన్‌-సిద్ధూ.. రాహుల్‌ హర్షం!

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన నవజోత్ సింగ్‌ సిద్ధూ ఎట్టకేలకు చేతులు కలిపారు.

Updated : 23 Jul 2021 15:17 IST

దిల్లీ: గతకొన్ని రోజులుగా పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత సంక్షోభానికి తెరపడింది. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజోత్ సింగ్‌ సిద్ధూ ఎట్టకేలకు చేతులు కలిపారు. పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు ఒకేతాటిపైకి వచ్చిన ఇద్దరు నేతలు మాటలు కలిపారు. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఇచ్చిన తేనీటి విందుకు సిద్ధూ హాజరై.. అసెంబ్లీ ఎన్నికలకు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పడంతో పంజాబ్‌ కాంగ్రెస్‌ సంక్షోభం కథ సుఖాంతమైనట్లు తెలుస్తోంది.

సంక్షోభం ముగిసింది.. చూడండి - రాహుల్‌ గాంధీ

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజోత్‌ సింగ్‌ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌కు సిద్ధూ లేఖ రాశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కూడా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కావాలని నిర్ణయించారు. దీంతో సీఎం అమరీందర్‌ శుక్రవారం ఉదయం పంజాబ్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సిద్ధూతో పాటు నేతలందరూ హాజరయ్యారు. వారందరి సమక్షంలో ఇరువురు నేతలు కలిసి.. పార్టీ అంతర్గత వివాదం ముగిసిందనే సంకేతాలను పంపించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. పంజాబ్‌ సంక్షోభం ముగిసింది, మీరు చూడొచ్చంటూ పేర్కొన్నారు.

క్షమాపణలు చెప్పకుండానే..

అయితే, తన ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేసిన సిద్ధూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని సీఎం అమరీందర్‌ ఈమధ్యే ఓ షరతు విధించారు. అప్పటివరకూ సిద్ధూను కలిసేది లేదని తేల్చి చెప్పారు. కానీ, సిద్ధూ మాత్రం క్షమాపణల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గిన ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌.. సిద్ధూ క్షమాపణలు చెప్పకున్నా ఆయనతో భేటీ అయ్యేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీలో నెలకొన్న అంతర్గత వివాదాలు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కాస్త ఇబ్బందిగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఓవైపు ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ను బుజ్జగిస్తూనే మరోవైపు నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించారు. పీసీసీ బాధ్యతలు సిద్ధూకు అప్పజెప్పడంపై తొలుత కెప్టెన్‌ అమరీందర్‌ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధూతో కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని