Corona in America: గంటకు 42 మంది మృతి..!

అమెరికాలో రోజువారీ కొవిడ్‌ మరణాల సంఖ్య వెయ్యి దాటగా.. సరాసరి గంటకు 42 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Published : 19 Aug 2021 01:33 IST

వెయ్యి దాటిన రోజువారీ కొవిడ్‌ మరణాలు

వాషింగ్టన్‌: ఏడాదిన్నర గడుస్తున్నా.. యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి వణికిస్తూనే ఉంది. ముఖ్యంగా వైరస్‌ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్‌ రావడంతో కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపించింది. కానీ డెల్టా వంటి కొత్తరకాలు వెలుగు చూడడంతో తాజాగా అక్కడ వైరస్‌ తీవ్రత మరోసారి పెరిగింది. దీంతో రోజువారీ కొవిడ్‌ మరణాల సంఖ్య వెయ్యి దాటగా.. సరాసరి గంటకు 42 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అమెరికాలో వైరస్‌ తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపించింది. దీంతో చాలా ప్రాంతాల్లో మాస్కులు ధరించడంపైనా ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. కానీ, గత నెల రోజులుగా అక్కడ కొవిడ్‌ కేసులు, మరణాల సంఖ్య అనుహ్యంగా పెరిగాయి. నిత్యం సరాసరి 769 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంగళవారం ఒక్కరోజే ఈ సంఖ్య 1017కు చేరింది. ఇలా అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 6లక్షల 22వేలకు దాటింది.

మున్ముందు మరింత ప్రమాదకర పరిస్థితులు..

కొంతకాలంగా అమెరికాలో వైరస్‌ తీవ్రత పెరగడంతో ఆస్పత్రి చేరికలు కూడా ఎక్కువయ్యాయి. గడిచిన రెండు వారాల్లోనే ఆస్పత్రి చేరికలు దాదాపు 70శాతం పెరిగినట్లు అంచనా. కరోనా వైరస్‌ తీవ్రత మరోసారి పెరగడంతో మున్ముందు మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (NIH) హెచ్చరించింది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ తీసుకోనివారికి ప్రమాదం అంచున ఉన్నట్లేనన్న ఎన్‌ఐహెచ్‌, కొవిడ్‌ పోరుపై కొంతమంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని