Sharmistha Dubey: ఆమె ప్రపంచం దృష్టిలోయోగ్యురాలే..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా భారత సంతతికి చెందిన మ్యాచ్‌ గ్రూప్ సీఈఓ శర్మిష్ఠా దూబేపై ప్రశంసల జల్లు కురిపించారు.

Published : 29 Dec 2021 21:28 IST

భారత సంతతి సీఈఓపై మహీంద్రా ప్రశంసలు

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా భారత సంతతికి చెందిన మ్యాచ్‌ గ్రూప్ సీఈఓ శర్మిష్ఠా దూబేపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె ప్రపంచంలో దృష్టిలో ఉండటానికి అర్హురాలంటూ అభినందించారు. 

‘నేను ఆమె గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి. అది నేను ఒప్పుకోవాలి. ఆమె మ్యాచ్‌ మేకింగ్‌ సైట్లకు నాయకత్వం వహిస్తున్నారు. అందువల్లే ఆమె పేరు భారత సంతతికి చెందిన సీఈఓల జాబితాలో ప్రస్తావించడం లేదా? టిండర్‌ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన డేటింగ్ యాప్‌’ అంటూ న్యూయార్క్‌ టైమ్స్‌లో ఆమె గురించి ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు. అలాగే ఆమె అందరి దృష్టిలో ఉండటానికి అర్హురాలంటూ వ్యాఖ్యానించారు.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం తీసుకువచ్చిన అబార్షన్ చట్టంపై స్పందించిన అతికొద్దిమంది సీఈఓల్లో శర్మిష్ఠా దూబే ఒకరు. గర్భం దాల్చిన ఆరువారాల తర్వాత అబార్షన్‌ను నిషేధిస్తూ ఈ చట్టం కింద ఆ రాష్ట్రం నిబంధన తీసుకువచ్చింది. ‘మా వ్యాపారానికి సంబంధించిన విషయంలో తప్ప రాజకీయంగా ఇతర విషయాల్లో స్పందించం. కానీ ఈ విషయంలో నేను నిశ్శబ్దంగా ఉండలేను’ అంటూ దూబే ఆ చట్టాన్ని వ్యతిరేకించారు. దీనికి సంబంధించి ఆ రాష్ట్రం వెలుపల సంరక్షణ కోరుకునే  అక్కడి ఉద్యోగుల కోసం ఒక నిధిని ఏర్పాటుచేశారు. ఇలా ఆమె స్పందించిన తీరే మహీంద్రాను మెప్పించింది.

సుందర్ పిచాయ్‌, శర్మిష్ట చదివింది ఒక చోటే..

ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన శర్మిష్ఠ.. 1993లో ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. ఆ ఏడాది మెటలర్జికల్ ఇంజినీరింగ్‌ విభాగంలో పట్టా పొందిన ఏకైక మహిళ ఆమె. మరో విషయం ఏంటంటే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆమె క్లాస్‌మేట్. అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు ఏడాది పాటు స్టీల్ కంపెనీలో పనిచేశారు. అనంతరం ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ పట్టా పొందారు. 2006లో మ్యాచ్‌ గ్రూప్‌లో చేరిన ఆమె.. అంచెలంచెలుగా ఎదిగి, 2020లో మ్యాచ్‌ గ్రూప్‌ సీఈఓగా పదోన్నతి పొందారు. ఈ సంస్థ టిండర్‌, మ్యాచ్‌, మీటిక్‌, ఓకేక్యూపిడ్‌, హింజ్‌, పెయిర్స్‌ వంటి తదితర ఆన్‌లైన్ డేటింగ్‌ సేవలను అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని