Anand Mahindra: సిలికాన్ వ్యాలీ నుంచి ఫ్యాషన్ రంగానికి వ్యాపించిన మంచి వైరస్!

మరో అంతర్జాతీయ సంస్థకు భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓగా ఎంపిక కావడంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సరదాగా స్పందించారు. మంచి వైరస్ అని ట్వీట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. 

Published : 17 Dec 2021 16:20 IST

ముంబయి: మరో అంతర్జాతీయ సంస్థకు భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓగా ఎంపిక కావడంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సరదాగా స్పందించారు. మంచి వైరస్ అని ట్వీట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. 

భారత సంతతికి చెందిన లీనా నాయర్ ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌ Chanelకు గ్లోబల్‌ సీఈఓగా ఎంపికయ్యారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు భారత సంతతి వ్యక్తుల నేతృత్వంలోనే నడుస్తున్నాయి. ఇటీవల ట్విటర్‌కు భారత్‌ నుంచి వెళ్లిన పరాగ్ అగర్వాల్ సీఈఓగా నియమితులయ్యారు. ఇప్పుడు లీనా నాయర్. దీనిపై ఆనంద్‌ స్పందిస్తూ.. ‘కేవలం సిలికాన్ వ్యాలీకి మాత్రమే కాదు. ఫ్యాషన్ రంగానికి కూడా భారతీయ సీఈఓ ‘మంచి వైరస్’ అంటుకుంది. అభినందనలు లీనా. మమ్మల్ని గర్వపడేలా చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. 

పరాగ్‌ అగర్వాల్ ఎంపికైనప్పుడు కూడా ఆనంద్ ఇదే తరహాలో భారతీయ సీఈఓ వైరస్ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ మహమ్మారి భారత్‌లో పుట్టిందని చెప్పేందుకు గర్వంగా ఉంది. ఇది భారతీయ సీఈఓ వైరస్‌. దీనికి టీకా లేదు’ అంటూ చమత్కరించారు. 

ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన లీనా నాయర్.. మానవ వనరుల విభాగంలో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ సంస్థ యూనీలివర్‌లో మొదటి మహిళా ప్రధాన మానవ వనరుల అధికారిగానూ విధులు నిర్వర్తించారు. జనవరిలో Chanel గ్లోబల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని