
Schools ReOpen: మహమ్మారి అంతానికి ఇదే ఆరంభం: ఆనంద్ మహీంద్రా
దిల్లీ: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. అయితే, దేశంలో కొవిడ్ ఉద్ధృతి కాస్త నియంత్రణలోనే ఉండడం, మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండడంతో పలు రాష్ట్రాలు పాఠశాలలను తిరిగి తెరచేందుకు అనుమతి ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర తర్వాత దేశంలో పాఠశాలలు పునఃప్రారంభం కావడం పట్ల ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహమ్మారి అంతానికి ఇదే ఆరంభం అవుతుందని అభిప్రాయపడ్డారు.
‘చివరకు.. అనుగ్రహం లభించింది. ఎదిగే వయసులో ఎంతో కీలకమైన స్నేహితులు, సమాజం నుంచి పొందే అనుభవాలకు ఇంటి నుంచి తరగతులు ప్రత్యామ్నాయం కావు. తిరిగి చూస్తే.. మహమ్మారి అంతానికి ఇదే ఆరంభం అవుతుంది’ అంటూ ఆనంద్ మహీంద్రా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో మూడో ముప్పు ఉందని నివేదికలు వస్తున్నప్పటికీ.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరిచేందుకు ఆయా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయనే వార్తలపై ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో ఈ విధంగా స్పందించారు.
ఇదిలాఉంటే, దేశంలో కరోనా రెండో దశ విజృంభణ ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం నిత్యం 40వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. ఇలా ఓవైపు కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ పాఠశాలలు తెరవాలని పలు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే మహారాష్ట్ర, దిల్లీ, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచే పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ స్థానిక పరిస్థితులను బట్టి ఆయా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.