
Karnal: చర్చలు విఫలం.. సెక్రటేరియట్ ముందే రైతుల బైఠాయింపు!
హరియాణా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్న రైతు నేతలు
కర్నాల్: అన్నదాతలపై పోలీసులు చేసిన లాఠీఛార్జిని నిరసిస్తూ హరియాణా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. రైతుల తలలు పగలగొట్టాలంటూ ఆదేశించిన ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హాను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నాల్‌లో మినీ సచివాలయం ముందు రైతులు చేస్తోన్న నిరసన రెండో రోజూ కొనసాగింది. ఈ నేపథ్యంలో రైతులతో అధికారులు మరోసారి చర్చలు జరిపినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు. దీంతో ప్రభుత్వం దిగొచ్చే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.
ప్రభుత్వ మొండి వైఖరి వల్లే చర్చలు మరోసారి విఫలమయ్యాయని కిసాన్ సంయుక్త్ మోర్చా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. వీటిపై మూడు గంటలపాటు చర్చలు జరిగినప్పటికీ రైతుల డిమాండ్ల పట్ల హరియాణా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని దుయ్యబట్టారు. కేవలం ఐఏఎస్ అధికారిపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం.. ఆయనను సస్పెండ్ చేసేందుకు సిద్ధంగా లేదని విమర్శించారు. దీంతో ఇదే ప్రాంతంలో తమ దీక్షను కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయిత్ స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, గత నెల 28న కర్నాల్‌లో రహదారిని దిగ్బంధం చేసిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడని, అందుకు బాధ్యుడైన ఆయుష్ సిన్హాను విధుల నుంచి తొలగించాలని కర్షక నేతలు డిమాండ్ చేశారు. ఇందుకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కర్నాల్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్ కోసం తరలివచ్చిన వేల మంది రైతులు జిల్లా ప్రధాన కార్యాలయాలున్న మినీ సచివాలయానికి ర్యాలీగా వెళ్లి ముట్టడించారు. ఆ సమయంలోనూ వారిపై పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై బుధవారం కూడా జిల్లా అధికారులు మరోసారి చర్చలు జరిపినప్పటికీ రైతుల డిమాండ్లు నెరవేరకపోవడంతో కర్షక నేతలు నిరసన కొనసాగిస్తున్నారు. హరియాణా ప్రభుత్వం తమ డిమాండును నెరవేర్చేవరకూ అక్కడి నుంచి కదలబోమంటూ బైఠాయించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.