Booster dose: బూస్టర్‌ డోసులపై మార్గదర్శకాలు లేవు.. కోర్టుకు నివేదించిన కేంద్రం

దేశంలో బూస్టర్‌ డోసులు అవసరమని చెప్పేందుకు నిపుణులు, శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవని కేంద్రం పేర్కొంది. దేశంలో బూస్టర్​ డోసుల ఆవశ్యకతకు సంబంధించి......

Published : 14 Dec 2021 16:36 IST

దిల్లీ: దేశంలో బూస్టర్‌ డోసులు అవసరమని చెప్పేందుకు నిపుణులు, శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవని కేంద్రం పేర్కొంది. దేశంలో బూస్టర్​ డోసుల ఆవశ్యకతకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్టు దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​లో కేంద్రం వెల్లడించింది. నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఆఫ్​ ఇమ్యునైజేషన్​ (ఎన్​టీఏఐజీ), నేషనల్​ ఎక్స్​పర్ట్​ గ్రూప్​ ఆన్​ వ్యాక్సిన్​ అడ్మినిస్ట్రేషన్​ ఫర్​ కొవిడ్​​ (ఎన్ఈజీవీఏసీ) శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నాయని వివరించింది. బూస్టర్​ డోసు పంపిణీపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని, కరోనా టీకా డోసుల షెడ్యూల్​పైనా చర్చలు జరుపుతున్నాయని అందులో తెలిపింది.

జాతీయస్థాయిలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేందుకు ఎన్​టీఏజీఐ, ఎన్​ఈజీవీఏసీ విలువైన మార్గనిర్దేశాలను అందిస్తున్నట్టు కోర్టుకు కేంద్రం వెల్లడించింది. టీకా తీసుకుంటే శరీరం పొందే రోగనిరోధక శక్తి ఎంత కాలం ఉంటుందనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదని చెప్పిన కేంద్రం.. రోజులు గడుస్తున్న కొద్దీ మెరుగైన సమాచారం లభించే అవకాశముందని పేర్కొంది. వైరస్​ లక్షణాలపై సరైన, పూర్తి సమాచారం లేదని.. అలాంటప్పుడు బూస్టర్​ డోసు పంపిణీపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని స్పష్టం చేసింది. అర్హులైన వారందరికీ టీకా రెండు డోసులు పంపిణీ చేయడమే ప్రస్తుతం తమ లక్ష్యమని.. మూడో​ డోసుపై ఆయా సంస్థలు ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని తెలిపింది.

పాశ్చాత్య దేశాల్లో బూస్టర్​ డోసు పంపిణీ జోరందుకుంటున్న నేపథ్యంలో.. భారత్​లో ప్రస్తుత పరిస్థితులను వివరించాలని కేంద్రాన్ని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. కొవిడ్​కు బూస్టర్​ డోసు అవసరమా? అవసరమే అయితే.. ఎప్పటిలోగా వాటిని అందుబాటులో ఉంచుతారు? అన్న ప్రశ్నలకు సమాధానంగా అఫిడవిట్​ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బూస్టర్​ డోసుల వినియోగంపై కేంద్రం వివరణ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని