Afghanistan: దేశం విడిచివెళ్లిన అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ..!

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌కు తాలిబన్లు చేరుకోవడంతో దేశం మొత్తం వారి అస్తగతమైంది. దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్‌ ఘనీ కీలక బృందంతో కలిసి దేశం విడిచివెళ్లినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.

Published : 16 Aug 2021 01:48 IST

అధికార బదిలీకి ప్రభుత్వంతో తాలిబన్ల సంప్రదింపులు

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌కు తాలిబన్లు చేరుకోవడంతో దేశం మొత్తం వారి హస్తగతమైంది. దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్‌ ఘనీ.. కీలక బృందంతో కలిసి దేశం విడిచివెళ్లినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం తజికిస్తాన్‌కు వెళ్లిన అష్రఫ్‌, అక్కడ నుంచి వేరే దేశానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక అన్ని వైపుల నుంచి తాలిబన్లు కాబూల్‌ను చుట్టుముట్టినట్లు అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి మీడియాతో పేర్కొన్నారు. అయితే, అఫ్గాన్‌ సైన్యం, తాలిబన్లకు మధ్య కాల్పులు జరిగాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

తాలిబన్లు కాబూల్‌పై ఎలాంటి దాడి చేయలేదని, అధికార మార్పు శాంతియుతంగా జరుగుతుందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ కూడా ప్రకటించారు. ఈ ప్రక్రియ శాంతియుతంగా ముగిసే వరకూ కాబూల్‌కు అన్ని ప్రవేశ మార్గాల వద్ద తాలిబన్‌ సైన్యం వేచి ఉంటుందని వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిని ప్రత్యేక హెలికాప్టర్‌లో తరలించింది. మరోపక్క తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ పాలన పగ్గాలను స్వచ్ఛందంగా అప్పజెప్పినట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి.

ఇదిలాఉంటే, అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ పదవి నుంచి తప్పుకొని దేశం విడిచి వెళ్లనున్నారని రెండు రోజుల ముందునుంచే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో దేశప్రజలనుద్దేశిస్తూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అఫ్గాన్‌ ప్రజలపై యుద్ధం ప్రకటించడాన్ని అంగీకరించనన్న ఆయన.. రెండు దశాబ్దాలుగా సాధించిన లక్ష్యాలను కోల్పోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్నీ సహించనని అష్రఫ్‌ ఘనీ పేర్కొన్నారు. కానీ, విస్తృత వేగంతో తాలిబన్లు కాబూల్‌ను చేరుకోవడంతో తప్పని పరిస్థితుల్లో అధికారాన్ని వదిలి.. దేశాన్ని విడిచిపోయేందుకు అష్రఫ్‌ ఘనీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని