Ashraf Ghani in UAE: యూఏఈలో తలదాచుకున్న అష్రాఫ్‌ ఘనీ..!

అఫ్గానిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ప్రస్తుతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE)లో తలదాచుకున్నట్లు వెల్లడైంది. మనవతా దృక్పథంతో అష్రాఫ్‌ ఘనీతో పాటు ఆయన కుటుంబానికి ఆశ్రయం కల్పించామని యూఏఈ విదేశాంగశాఖ వెల్లడించింది.

Published : 18 Aug 2021 20:36 IST

నిర్ధారించిన యూఏఈ విదేశాంగశాఖ

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ మొత్తం తాలిబన్ల వశమైన తర్వాత దేశం విడిచి వెళ్లిపోయిన మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ఆచూకీపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE)లో ఉన్నట్లు తెలిసింది. మానవతా దృక్పథంతో అష్రాఫ్‌ ఘనీతో పాటు ఆయన కుటుంబానికి ఆశ్రయం కల్పించామని యూఏఈ విదేశాంగశాఖ ప్రకటించింది. కానీ, యూఏఈలో ఏ ప్రదేశంలో ఉన్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఇక తాలిబన్లు కాబుల్‌కు చేరుకునే సమయంలోనే ఓటమిని ఊహించిన  అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. తొలుత తజికిస్థాన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అందుకు ఆ దేశం నిరాకరించింది. దీంతో అక్కడి నుంచి ఆయన అమెరికా లేదా వేరే దేశం వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ చివరకు ఆయన యూఏఈ వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే, ఆ సమయంలో భారీ నగదు, ఖరీదైన నాలుగు కార్లతో అష్రాఫ్‌ ఘనీ ఉడాయించారనే ఆరోపణలు వచ్చాయి. కార్లలో నగదుతో పాటు మరో హెలికాప్టర్‌లోనూ డబ్బును తీసుకువెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు హమ్‌దుల్లా మోహిద్‌, ఘనీ ముఖ్య సలహాదారు ఫాజెల్‌ మహమ్మూద్‌లను అరెస్టు చేయాలని తజికిస్థాన్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం ఇంటర్‌పోల్‌ను కోరింది. దేశ ప్రజల సంపదను ఎత్తుకెళ్లారని వస్తోన్న ఆరోపణలపై వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది.

ఇదిలాఉంటే, సంక్షోభ సమయంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రాఫ్‌ ఘనీ.. దేశం విడిచి పారిపోవడం పట్ల అక్కడి ప్రజల నుంచే కాకుండా అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. అయితే, దేశంలో రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లిపోతున్నట్లు అష్రాఫ్‌ ఘనీ ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని