
చేరువలో 100 కోట్ల లక్ష్యం.. వాక్సినేషన్‌పై గీతాన్ని విడుదల చేసిన కేంద్రం
ఆలపించింది ఎవరో తెలుసా..?
దిల్లీ: కరోనా టీకా కార్యక్రమం 100 కోట్ల డోసుల పంపిణీకి చేరువవుతున్న తరుణంలో నేడు కేంద్ర ప్రభుత్వం ఆడియో విజువల్ గీతాన్ని విడుదల చేసింది. వ్యాక్సినేషన్‌పై ఈ గీతం రూపొందింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన కైలాష్ ఖేర్ దీన్ని ఆలపించారు. దిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో కైలాష్ ఖేర్ కూడా పాల్గొన్నారు.
కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్రం జనవరి 16న టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంతకాలం నెమ్మదిగా సాగిన టీకాల పంపిణీ ఇటీవల వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 97 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. 69,36,99,468 మంది మొదటి డోసు, 27,81,14,080 మంది రెండో డోసు తీసుకున్నారు. 73 శాతం మంది అర్హులకు ఇప్పటివరకు మొదటి డోసు అందినట్లు కేంద్రం వెల్లడించింది. అక్టోబర్ 18-19 లోగా 100 కోట్ల లక్ష్యానికి చేరుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.