Vaccine Wastage: వ్యాక్సిన్‌ వృథా కట్టడితో.. 10శాతం ఖర్చు ఆదా!

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రతి నెల దాదాపు 10కోట్లకు పైగా డోసులను అందిస్తున్నారు. ఇదే సమయంలో వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి పిలుపునిచ్చారు.

Updated : 06 Sep 2021 16:02 IST

ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి ప్రధాని మోదీ పిలుపు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రతి నెల దాదాపు 10 కోట్లకు పైగా డోసులను అందిస్తున్నారు. ఇదే సమయంలో వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి పిలుపునిచ్చారు. తద్వారా వ్యాక్సినేషన్‌ ఖర్చును 10శాతం తగ్గించవచ్చని అన్నారు. అర్హులందరికీ కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ అందించిన రాష్ట్రంగా హిమాచల్‌ ప్రదేశ్‌ నిలిచిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, లబ్ధిదారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ విస్తృత స్థాయిలో చేపట్టడంలో భాగంగా అన్ని రాష్ట్రాలు మెగా డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజల్లో వ్యాక్సిన్‌లపట్ల అవగాహన కల్పించడంతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్‌లను వేగంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌పై జరుగుతోన్న పోరులో అర్హులందరికీ తొలిడోసు అందించి హిమాచల్‌ ప్రదేశ్‌ ఓ బెంచ్‌మార్క్‌ను నమోదు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ముఖ్యంగా ‘సురక్షా కా యుక్తి- కరోనా సే ముక్తి’ నినాదంతో వృద్ధులు, దివ్యాంగులు, కార్మికులతో పాటు రోజువారీ కూలీలకు వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించింది. ఇదే సమయంలో ప్రతి రాష్ట్రం కూడా వ్యాక్సిన్‌ వృథాను అరికట్టడం వల్ల ఖర్చును భారీగా ఆదా చేయవచ్చని సూచించింది.

ఇదిలా ఉంటే, దేశంలో కరోనా వైరస్‌ మూడో ముప్పు పొంచి ఉందని వస్తోన్న వార్తల నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతినెల 10 కోట్లకుపైగా డోసులను అందించేందుకు కృషి చేస్తున్నాయి. ఇలా జూన్‌లో 11కోట్లు, జులైలో 13కోట్ల డోసులను పంపిణీ చేయగా.. ఆగస్టులో దాదాపు 15కోట్ల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 68కోట్ల డోసులను అందించినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని