Crime News: రోడ్డు ప్రమాదానికి గురైన ‘బచ్‌పన్‌ కా ప్యార్‌’ బాలుడు

ఛత్తీస్‌గఢ్‌లో మారుమూల ప్రాంతమైన సుకుమా జిల్లాలో మంగళవారం సాయంత్రం సహ్‌దేవ్‌ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి...

Updated : 29 Dec 2021 04:57 IST

సుకుమా: ‘బచ్‌పన్‌ కా ప్యార్‌’ పాటతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుపరిచితమైన బాలుడు సహ్‌దేవ్‌ దిర్దో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మంగళవారం సాయంత్రం సహ్‌దేవ్‌ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి కిందపడటంతో సహ్‌దేవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనాన్ని నడపుతున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.

సహ్‌దేవ్‌ను తొలుత సుకుమా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జగ్‌దల్‌పూర్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ వినీత్‌ నందన్‌వర్‌, ఎస్పీ సునీల్‌ శర్మ సహ్‌దేవ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సహ్‌దేవ్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ అధికారులను ఆదేశించారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కీలకమైన ప్రాంతంగా పేరొందిన సుకుమా జిల్లాకు చెందిన సహ్‌దేవ్‌.. 2019లో తరగతి గదిలో ‘బచ్‌పన్‌ కా ప్యార్‌’ పాట పాడాడు. దీన్ని ఆ స్కూల్‌ టీచర్‌ వీడియో తీశాడు. కొన్ని రోజుల క్రితం ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. పలువురు ప్రముఖులు సహ్‌దేవ్‌ను ప్రశంసించారు. ఆ పాటను అనుకరిస్తూ పలువురు వీడియోలు కూడా చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ సైతం బాలుడి ప్రతిభకు ఫిదా అయ్యారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని