Ecuador prison gangs: జైల్లో భారీ ఘర్షణలు.. 68 మంది మృతి

ఈక్వెడార్‌లో ఓ జైలులో ఖైదీల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు....

Published : 14 Nov 2021 17:36 IST

క్విటో(ఈక్వెడార్‌): ఈక్వెడార్‌లో ఓ జైలులో ఖైదీల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వాయాక్విల్‌ నగరంలోని లిటోరల్ జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖైదీల నుంచి పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 900 మంది పోలీసులు ఎనిమిది గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జైలు నుంచి భారీ పేలుడు శబ్దాలు రావడంతో స్థానిక ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక కొన్ని నిమిషాల పాటు గందరగోళానికి గురయ్యారు.

జైలులో భారీ ఎత్తున మరణాలు సంభవించడంతో ఖైదీల బంధువులు కారాగారం వద్ద ఆందోళనకు దిగారు. తమవారు ప్రాణాలతో ఉన్నారో.. లేదో.. తెలపాలని జైలు అధికారులను నిలదీశారు. మరోవైపు జైలులో జరిగిన మారణహోమానికి సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడం, కొన్నింటిని కాల్చివేయడం అందులో కనిపిస్తోంది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాకు చెందిన రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది. గొడవల్లో భాగంగా దుండగులు గోడను డైనమైట్‌తో పేల్చేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. జైల్లోకి వెళ్లే సరకుల వాహనాలు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు ఖైదీలకు చేరినట్లు భావిస్తున్నారు. 

రెండు నెలల క్రితం మరో జైల్లోనూ ఇదే తరహాలోనే ఘర్షణలు తలెత్తగా.. 119 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు