Narendra Modi: ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లోనూ భాజపాదే విజయం..!

మరికొన్ని నెలల్లో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాదే విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated : 24 Sep 2022 15:37 IST

తెలుగు రాష్ట్రాల్లో బలం పెరుగుతోందన్న మోదీ, జేపీ నడ్డా

దిల్లీ: మరికొన్ని నెలల్లో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాదే విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సామాన్యులకు పార్టీకి మధ్య విశ్వాస వారధిగా నిలవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, దేశంలో కొవిడ్‌ తీవ్రతే ప్రధాన అజెండాగా జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ముఖ్య నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం దిల్లీలో జరిగింది. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల భాజపా ముఖ్య నేతలు వర్చువల్‌ పద్ధతిలో పాల్గొన్నారు. ఈ సమావేశం ముగింపు సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా భాజపా బలాన్ని పుంజుకుంటోందన్నారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపాదే విజయమనే విశ్వాసం వ్యక్తం చేశారు. సేవ, సంకల్పం, నిబద్ధత వంటి విలువలపైనే భారతీయ జనతా పార్టీ నడుస్తోందని మోదీ ఉద్ఘాటించారు. అంతేకానీ ఒకే కుటుంబం చుట్టూ పార్టీ నడవదని ప్రతిపక్షాలను పరోక్షంగా విమర్శించారు. ఇక పార్టీ బలోపేతంపై మాట్లాడిన మోదీ.. సామాన్యులకు, పార్టీకి మధ్య విశ్వాస వారధిగా నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బలం పుంజుకుంటోంది..

తెలుగు రాష్ట్రాల్లో భాజపా పనితీరు పట్ల ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాలపై పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. బద్వేలు ఉపఎన్నికల్లో భాజపాకు బలం పెరిగిందని.. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు భాజపాకు అనుకూలంగా మారుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భాజపా నేతలకు జేపీ నడ్డా ప్రత్యేకంగా అభినందనలు తెలినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన పార్టీ మేధోమథన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతలు, 124 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు నేరుగా హాజరయ్యారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా భాజపా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల భాజపా అధినేతలు, ఇతర సభ్యులు వర్చువల్‌ పద్ధతిలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని