Mamata Banerjee: ప్రధాని మోదీతో సమావేశమైన దీదీ

హస్తిన పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ సాయంత్రం లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లిన ఆమె..

Updated : 27 Jul 2021 17:49 IST

దిల్లీ: హస్తిన పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ సాయంత్రం ప్రధాని నివాసానికి వెళ్లిన ఆమె.. మోదీతో సమావేశమయ్యారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం తర్వాత దీదీ.. ప్రధాని మోదీతో భేటీ అవడం ఇదే తొలిసారి. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పరిస్థితులపై ప్రధానితో చర్చించినట్లు తెలిపారు.

‘‘ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మా రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు తక్కువగా అందాయి. జనాభాను దృష్టిలో పెట్టుకుని మాకు మరిన్ని టీకాలు ఇవ్వాలని ప్రధానిని కోరా’’ అని ఆమె తెలిపారు. అంతేగాక, రాష్ట్రానికి అందాల్సిన వరద సాయం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా చర్చించినట్లు ఆమె వెల్లడించారు. దేశంలోని ప్రతిపక్షాలు వాటంతట అవే ఐక్యతను సంతరించుకుంటాయని మమతా బెనర్జీ అన్నారు. విపక్ష కూటమికి సారథ్యం వహిస్తారా? అని విలేకర్లు అడగ్గా..  ప్రతిపక్షాలను దేశమే ఐక్యంగా ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌ను కుదిపేస్తున్న పెగాసస్‌ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్నారు. 

అంతకుముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కమల్‌నాథ్‌, ఆనంద్‌ శర్మలతో మమత భేటీ అయ్యారు. బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీలతో భేటీ అవుతారు. అటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లతోనూ దీదీ సమావేశం కానున్నట్లు సమాచారం. 

ఐదు రోజుల పర్యటన నిమిత్తం మమత సోమవారం దిల్లీ చేరుకున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను బలంగా ఢీకొట్టాలన్నది ఆమె వ్యూహంగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున విపక్ష నేతలంతా దిల్లీలోనే ఉన్నారు. ఈ అంశంపై వారితో చర్చించేందుకు వీలుగా తృణమూల్‌ అధ్యక్షురాలు దిల్లీలో పర్యటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని