ఆత్మలతో మాట్లాడతానంటూ ఇల్లు వదిలి వెళ్లిపోయిన బాలిక​!

కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన అనుష్క అనే మైనర్‌ (17) ఈ ఏడాది అక్టోబర్​ 31వ తేదీన ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ‘షమానిజం’పై ఉన్న ఆసక్తితోనే......

Published : 31 Dec 2021 23:30 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ మైనర్‌ బాలిక (17) ఈ ఏడాది అక్టోబర్​ 31న ఇంట్లో నుంచి అదృశ్యమైంది. అయితే ఇల్లు వదిలి వెళ్లేలా ఆమెను ఎవరో ప్రభావితం చేశారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ‘షమానిజం’పై ఉన్న ఆసక్తితోనే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పేర్కొంటున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆమె ఆచూకీ లభించడం లేదు.

కళ్లకు కనిపించనివాటిపై నమ్మకం పెంచుకోవడాన్నే షామానిజం అంటారు. దీనికి ప్రభావితమైనవారు దేవుళ్లు, దెయ్యాల ప్రపంచాన్ని చూస్తున్నట్టు భావిస్తుంటారు. భూతాలు, పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తుంటారు. అయితే అదృష్యమైన బాలికకు కూడా దీనిపై ఆసక్తి ఉండేదని ఆమె తల్లి వెల్లడించారు. ఎక్కడున్నా తిరిగి రావాలని కోరుతూ కన్నీరు పెట్టుకున్నారు.

‘‘షామానిజం తరహా ధ్యానం నేర్చుకోవాలని ఉందని నాతో చెప్పింది. షామానిజం అంటే మాకు తెలియదు. తను చెప్తేనే మాకు దాని గురించి తెలిసింది. ఆమె బాధ చూడలేక ఇంట్లోనే ఉండి నేర్చుకో అని చెప్పిచూశాం. అయితే ఇంట్లో ఉండి దాన్ని నేర్చుకోలేనని అనుకున్నట్లుంది’’ అని బాలిక తల్లి వాపోయింది. ‘‘ఇంట్లోంచి వెళ్లిపోయే ఒకరోజు ముందు కూడా తనకు నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించాం. ‘మీరెవరూ నన్ను అర్థం చేసుకోరు’ అంటూ తిరిగి మాపై అరిచింది. ఆ సమయంలో నేను తనను తిట్టాను. మందలించాను. అందుకు నేను క్షమాపణలు కూడా చెప్పాను. కానీ వాకింగ్‌కు అని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఇప్పుడు అందరి ముందు నేను నా కూతురికి క్షమాపణలు చెబుతున్నా. ఇకనైనా తిరిగిరా’’ అంటూ ఆ బాలిక తల్లి కన్నీరుమున్నీరైంది.

మరోవైపు బాలిక ఆచూకీ కనుగొనడంలో పోలీసుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో బాలిక తండ్రే సొంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా తన కూతురి వివరాలు షేర్​ చేసి, ఎవరికైనా కనపడితే వెంటనే సమాచారం చెప్పాలని వేడుకుంటున్నారు. ‘‘జులై-ఆగస్టులో ఆమెలో మార్పులు గమనించాం. మాతో ఎక్కువగా మాట్లాడేది కాదు. అయితే తనకు నచ్చిన కళాశాలలో సీటు రాలేదన్న బాధలో ఉందనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా కుమార్తెను ఎవరో ప్రభావితం చేశారు. లేకపోతే.. ఇంటిని వదిలి, స్వయంగా బతకలేదు. పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నా కూతురిని వెతికేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా నేను ప్రయత్నిస్తున్నాను’’ అని బాలిక తండ్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు