
Bharat Biotech: బూస్టర్ డోసుగా ముక్కుద్వారా తీసుకునే టీకా..!
తుదిదశ ప్రయోగాల అనుమతికి భారత్ బయోటెక్ దరఖాస్తు
బెంగళూరు: కొవిడ్-19ను నిరోధించేందుకు ముక్కుద్వారా తీసుకునే (Intranasal) టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. దీన్ని బూస్టర్ డోసుగా ఇచ్చేందుకుగాను తుదిదశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు తాజాగా దరఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ముక్కు ద్వారా తీసుకునే ఈ టీకా ఎంతో తేలికగా ఉంటుందని భారత్ బయోటెక్ తన దరఖాస్తులో పేర్కొంది.
కొత్త వేరియంట్లు వెలుగు చూస్తోన్న వేళ బూస్టర్ డోసు ఇవ్వాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇటు భారత్‌లోనూ ఇదేవిధమైన డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే బూస్టర్ డోసుపై కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా బూస్టర్ డోసుగా ఏ వ్యాక్సిన్‌ను ఇవ్వాలనే దానిపై చర్చలు జరుపుతోన్న వ్యాక్సిన్ నిపుణుల కమిటీ.. మూడోదశ ప్రయోగాల సమాచారం లేకుండా వీటికి అనుమతి ఇవ్వవద్దనే అభిప్రాయానికి వచ్చింది. దీంతో బూస్టర్ డోసు ప్రయోగాలకు ఆయా వ్యాక్సిన్ తయారీ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.
ఇదిలాఉంటే, ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ ప్రయోగాలను భారత్ బయోటెక్ ముమ్మరంగా చేపడుతోంది. ఈ టీకా వల్ల వైరస్ శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే (ముక్కులోనే) రోగనిరోధక ప్రతిస్పందనలు కలుగుతాయి. తద్వారా వైరస్ బారినపడకుండా కాపాడుకోవడమే కాకుండా ఇన్‌ఫెక్షన్, సంక్రమణ నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ గతంలో వెల్లడించింది. ‘మొదటి గ్రూపు వారికి తొలిడోసుగా కొవాగ్జిన్ ఇచ్చి రెండో డోసుగా ముక్కుద్వారా తీసుకునే డోసు ఇస్తున్నాం. అదే విధంగా రెండో గ్రూపులో తొలి, రెండో డోసును ముక్కు ద్వారానే అందిస్తున్నాం. మూడో గ్రూపులో ముక్కు ద్వారా తొలిడోసు, కొవాగ్జిన్‌ను రెండో డోసుగా ఇచ్చి పరీక్షిస్తున్నాం’ అని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా ఇటీవలే వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.