Bhopal: భోపాల్‌ ఆసుపత్రి ఘటన.. బిడ్డ తప్పిపోయిందని తల్లిదండ్రుల నాటకం

భోపాల్‌ కమలా నెహ్రూ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో అగ్ని ప్రమాదం అనంతరం తమ పాప అపహరణకు గురైందని పట్టణానికి చెందిన భార్యాభర్తలు ఆరోపించడం కలకలం రేపింది.....

Published : 10 Nov 2021 20:42 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ కమలా నెహ్రూ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో అగ్ని ప్రమాదం జరిగి పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో తమ పాప అపహరణకు గురైందని పట్టణానికి చెందిన భార్యాభర్తలు ఆరోపించడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తల్లిదండ్రులు నాటకం ఆడుతున్నారని.. వారింట్లోనే శిశువు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

భోపాల్‌లోని గాంధీనగర్‌ ప్రాంతం న్యూ జైల్‌ రోడ్డుకు చెందిన అర్షి అనే మహిళ పురిటి నొప్పులతో కమలా నెహ్రూ ఆసుపత్రిలో చేరింది. నవంబర్‌ 8న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే రోజు రాత్రి ఆ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో ఎన్‌ఎన్‌సీయూలో 40 మంది శిశువులు ఉండగా.. వీరిలో 36 మంది పిల్లలను పక్కవార్డుకు తరలించారు. మరో నలుగురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలోనే తమ బిడ్డ తప్పిపోయిందని అర్షి, ఆమె భర్త మన్సూర్‌ ఆరోపించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దంపతుల అరెస్టు

ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆ పాప వారింట్లోనే క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రికి సమాచారం ఇవ్వకుండానే వారు తమ శిశువును తీసుకెళ్లి ఇలా నాటకమాడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆ దంపతులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఆర్‌ఎస్‌ మిశ్రా తెలిపారు. వారిని విచారిస్తున్నట్లు తెలిపారు.

8కి చేరిన మృతులు

కమలా నెహ్రూ ఆసుపత్రిలోని పిల్లల ఐసీయూ వార్డులో సోమవారం రాత్రి మంటలు చెలరేగి నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మొత్తం 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. గాయపడిన చిన్నారుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. అగ్నిప్రమాదంలో చిన్నారులు మరణించడం అత్యంత బాధాకరమని ట్వీట్‌ చేశారు. మృతుల తల్లిదండ్రులకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని