Taliban Existential Crisis: అస్తిత్వ సంక్షోభంలో తాలిబన్లు..!

అఫ్గానిస్థాన్‌ని హస్తగతం చేసుకున్న తాలిబన్లలో మార్పు రాలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌ను వశం చేసుకున్న తర్వాత చట్టబద్ధత కోసం అంతర్జాతీయ సమాజం ముందు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు.

Updated : 19 Aug 2021 21:42 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ని హస్తగతం చేసుకున్న తాలిబన్లలో మార్పు రాలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌ను వశం చేసుకున్న తర్వాత చట్టబద్ధత కోసం అంతర్జాతీయ సమాజం ముందు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయంలో తాలిబన్లను అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందని భావించడం లేదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.

అఫ్గానిస్థాన్‌ కంటే ప్రపంచంలో ఇతర ప్రాంతాల నుంచి అల్‌-ఖైదాతో పాటు వారి ఇతర అనుబంధ సంస్థల నుంచే ముప్పు ఎక్కువ అని జో బైడెన్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా సిరియా లేదా తూర్పు ఆఫ్రికా దేశాల్లోని అల్‌-ఖైదా అనుబంధ సంస్థల నుంచి పొంచివున్న ముప్పును విస్మరించడం హేతుబద్ధం కాదన్నారు. అంతేకాకుండా ఈ ముప్పు అమెరికాకే గణనీయంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అఫ్గాన్‌లో మహిళలు, బాలికలపై వ్యక్తమవుతున్న ఆందోళనలను జో బైడెన్‌ తోసిపుచ్చారు. సైనిక బలంతో మహిళా హక్కులను కాపాడే ప్రయత్నం చేయడం కూడా సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా మానవహక్కులను ఉల్లంఘిస్తున్న వారి ప్రవర్తనను మార్చుకునే విధంగా దౌత్య, అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు.

బలగాల ఉపసంహరణ గడువు పొడిగిస్తాం..

అఫ్గాన్‌లోని అమెరికన్లందరినీ సురక్షితంగా తరలించేవరకు తమ బలగాలు అక్కడే ఉంటాయని, ఈ క్రమంలో సైన్యం ఉపసంహరణ గడువునూ పొడిగిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఆగస్టు 31 వరకు తమ బలగాలను పూర్తి స్థాయిలో ఉపసంహరిస్తామని అమెరికా గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అఫ్గాన్‌లో 15 వేల మంది అమెరికన్లు ఉన్నట్లు ఓ న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్‌ వెల్లడించారు. 50 వేల నుంచి 60 వేల మంది వరకు అమెరికాతో అనుబంధం ఉన్న అఫ్గానీయులు, వారి కుటుంబీకులు ఉన్నారని.. వారినీ తరలించాలని భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వానికి ఆయుధాల విక్రయాలను నిలిపివేయాలని జో బైడెన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిఫెన్స్‌ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే ఆఫ్గాన్‌కు పంపకుండా పెండింగ్‌లో ఉన్న, ఇంకా పంపిణీ చేయని ఆయుధాల బదిలీని సమీక్షించనున్నట్టు అమెరికా రాజకీయ/మిలటరీ వ్యవహారాల విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని