Bihar: ముఖ్యమంత్రి కార్యక్రమంలో 14 మందికి కరోనా

ప్రజల్ని నేరుగా కలిసి, వారి సమస్యలు వినేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్వహించే జనతా దర్బార్​.. కరోనా వ్యాప్తికి వేదికైంది......

Published : 03 Jan 2022 23:35 IST

పాట్నా: ప్రజల్ని నేరుగా కలిసి, వారి సమస్యలు వినేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్వహించే జనతా దర్బార్​.. కరోనా వ్యాప్తికి వేదికైంది. మొత్తం 14 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. రాజధాని పాట్నాలో నిర్వహించే ప్రజా దర్బార్‌ వద్ద విధులు నిర్వహించే ముగ్గురు కానిస్టేబుళ్లకు, ఐదుగురు భోజనం వడ్డించే సిబ్బందికి, మరో ఆరుగురు ఫిర్యాదుదారులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. జనతా దర్బార్‌కు వచ్చే పౌరులకు అక్కడికక్కడే యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వీరికి వైరస్‌ సోకినట్లుగా తేలింది. దీంతో దీంతో అప్రమత్తమైన అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్‌ చేశారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకునే ప్రజా దర్బార్​కు పరిమిత సంఖ్యలో పౌరులను అనుమతించినట్లు అధికారులు పేర్కొన్నారు. 200 కన్నా తక్కువ మందినే పిలిచినట్లు తెలిపారు. అయితే, కొన్ని నెలల క్రితమే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకొన్న కొంతమంది.. తమకు ఇంకా ప్రజాకోర్టుకు పిలుపు రాలేదన్న అసంతృప్తితో నేరుగా ఇక్కడికి వస్తున్నట్లు వివరించారు.

మరోవైపు బిహార్​లో వైద్యులపై కరోనా పంజా విసురుతోంది. పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆసుపత్రిలో 87 మంది వైద్యులు కరోనా బారినపడడం కలకలం సృష్టించింది. ఎన్ఎంసీహెచ్​లో మొత్తం 194 నమూనాలకు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించగా.. అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 75 మందికి ఆదివారం వైరస్​ నిర్ధరణ అయింది. అయితే వీరిలో చాలామందికి లక్షణాలు లేవని, స్వల్ప లక్షణాలతో ఐదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరినట్లు పాట్నా కలెక్టర్‌ వెల్లడించారు. మిగతా వారంతా క్యాంపస్‌లోనే ఐసొలేషన్​లో ఉన్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని