Bill Gates: ఈ మహమ్మారి ఎప్పుడు ముగిసిపోవచ్చంటే.. :బిల్‌ గేట్స్

ఇక సాధారణ పరిస్థితులు వస్తున్నాయనే ఆశ చిగురించే లోపు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకున్నాం.. నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ, విహార యాత్రలు, వేడుకలు వంటి అన్ని ప్రణాళికలు రద్దు చేసుకోవాల్సి వస్తుంది

Updated : 22 Dec 2021 14:56 IST

కొత్త వేరియంట్‌పై గేట్స్ చెప్పిన మంచి మాట ఏంటంటే..?

వాషింగ్టన్‌: ఇక సాధారణ పరిస్థితులు వస్తున్నాయనే ఆశ చిగురించే లోపే.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకున్నాం.. నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ, విహార యాత్రలు, వేడుకలు వంటి అన్ని ప్రణాళికలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి.. వేగంగా ప్రబలుతున్న ఈ వేరియంట్, కొద్ది కాలంలో అన్ని దేశాలకు వ్యాపించనుంది.. ఈ మాటలన్నది ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్. తాజాగా వరుస ట్వీట్లు చేసిన ఆయన.. ఈ వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థించారు.

‘ఈ కొత్త వేరియంట్ ప్రతి ఇంటికీ వ్యాపిస్తుంది. ఇప్పటికే నా స్నేహితుల్లో కొందరు దీని బారినపడ్డారు. నేను ఈ సెలవుల్లో వేసుకున్న ప్రణాళికలన్నీ దాదాపుగా రద్దు చేసుకున్నాను. చరిత్రలో ఏ వైరస్ ప్రబలనంతా వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. కొద్ది కాలంలోనే ప్రపంచంలో అన్ని దేశాలకు చేరుకుంటుంది. అయితే దీనివల్ల వ్యాధి తీవ్రత ఏమేరకు ఉంటుందనేది ఇప్పుడు మనకు తెలియని అతి పెద్ద విషయం. దీని గురించి మరిన్ని విషయాలు తెలిసేవరకూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డెల్టాతో పోల్చితే.. ఒమిక్రాన్‌తో వ్యాధి తీవ్రత సగం మాత్రమే ఉన్నా.. వేగంగా ప్రబలే లక్షణం వల్ల ఉద్ధృతి భారీ స్థాయిలో ఉండొచ్చు. ఈ సమయంలో మనం ఒకరికొకరం సహకరించుకోవాలి. అలాగే మాస్కులు ధరించాలి. ఇళ్లలో పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చూసుకోవాలి. తప్పకుండా టీకాలు తీసుకోవాలి. బూస్టర్ తీసుకుంటే రక్షణ మరింత మెరుగవుతుంది. టీకా తీసుకున్నవారిలో బ్రేక్ థ్రూ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. అయితే టీకాలు ప్రజలు తీవ్ర ఆనారోగ్యం బారినపడకుండా, మరణించకుండా ఉండేలా రూపొందించినవి. ఆ విషయంలో అవి మెరుగ్గా పనిచేస్తున్నాయి’ అని బిల్‌గేట్స్‌ ట్వీట్లు చేశారు. 

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన ఆయన.. చివరగా ఒక మంచి మాట  చెప్పి ముగించారు. ‘ఒక దేశంలో ఒమిక్రాన్ డామినెంట్‌గా మారిన తర్వాత.. ఆ వేవ్ అక్కడ మూడు నెలల కంటే తక్కువ సమయమే ఉంటుంది. ఆ కొన్ని నెలలు మనకు చెడు రోజులుగా మారొచ్చు. కానీ మనం సరైన చర్యలు తీసుకుంటే.. ఈ మహమ్మారి 2022లో ముగిసిపోవచ్చు. ఈ సారి కూడా సెలవులన్నీ కరోనాతోనే వృథా కావడం నిరాశపరిచిందని తెలుసు. ఎప్పటికీ ఇలాంటి పరిస్థితే ఉండదుగా.. ఏదోఒక రోజు కరోనా ముగిసిపోతుంది. మనం ఒకరికొకరం సహకరించుకుంటే.. ఆ సమయం త్వరలోనే వస్తుంది’ అని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts