Corbevax: సెప్టెంబర్‌లో బయోలాజికల్‌ ఇ కరోనా టీకా..!

భారత్‌లో త్వరలోనే మరో దేశీయ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌-ఇ తయారు చేస్తోన్న కార్బెవ్యాక్స్‌ సెప్టెంబర్‌ చివరి నాటికి వినియోగానికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Published : 26 Jul 2021 18:45 IST

వచ్చే నెలలోనే అత్యవసర అనుమతికి దరఖాస్తు

దిల్లీ: భారత్‌లో త్వరలోనే మరో దేశీయ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌-ఇ తయారు చేస్తోన్న కార్బెవ్యాక్స్‌ సెప్టెంబర్‌ చివరి నాటికి వినియోగానికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ప్రయోగాలు ప్రారంభం అయినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెలలోనే అత్యవసర వినియోగ దరఖాస్తుకు బయోలాజికల్‌ ఇ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే డిసెంబర్ నాటికి 30కోట్ల వ్యాక్సిన్‌ డోసులను కేంద్ర ప్రభుత్వానికి బయోలాజికల్‌ ఇ అందించనుంది.

భారత్‌లో మూడో ముప్పును ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరంగా చేపట్టడమే కీలకమని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం డిసెంబర్‌ నాటికి దాదాపు 130కోట్ల డోసులను అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. వీటిని సేకరించించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బయోలాజికల్‌ ఇ తయారు చేస్తోన్న వ్యాక్సిన్‌ కోసం ముందస్తుగానే ఆర్థిక సహాయాన్ని కూడా అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతీ పవార్‌ పేర్కొన్నారు. ఆగస్టు చివరినాటికి అత్యవసర వినియోగ లైసెన్సుకు (EUL) దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. దీంతో డిసెంబర్‌ చివరి నాటికి ఆ సంస్థ 30కోట్ల డోసులను ప్రభుత్వానికి అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కాస్త మందకొడిగానే సాగుతోంది. జులై 26నాటికి దేశవ్యాప్తంగా 43కోట్ల 51లక్షల డోసులను పంపిణీ చేశారు. నిత్యం సరాసరి 30లక్షలకు పైగా డోసులను అందిస్తున్నప్పటికీ ఆదివారం నాడు కేవలం 18లక్షల 99వేల డోసులను మాత్రమే పంపిణీ చేశారు. డిసెంబర్‌ చివరి నాటికి 18ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్‌ అందించాలంటే నిత్యం దాదాపు 80లక్షల డోసులను పంపిణీ చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని