Chopper Crash: బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ప్రమాదానికి అదే కారణమా.?

భారత త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి సాంకేతిక లోపం లేదా విద్రోహచర్య కారణం కాదని దర్యాప్తు నివేదికలో తేలింది.

Published : 05 Jan 2022 22:09 IST

దిల్లీ: భారత త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి సాంకేతిక లోపం లేదా విద్రోహచర్య కారణం కాదని దర్యాప్తు నివేదికలో తేలింది. ఈ ఘటనకు ప్రతికూల వాతావరణం కారణంగా ఏర్పడే కంట్రోల్డ్‌ ఫ్లైట్‌ ఇన్‌టూ టెర్రెయిన్‌ (CFIT)నే ప్రధాన కారణంగా గుర్తించినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన నివేదిక కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు చేరింది. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధురి, ఎయిర్‌ మార్షల్‌ మానవీంద్ర సింగ్‌ నేతృత్వంలో జరిగిన దర్యాప్తునకు సంబంధించిన విషయాలను కేంద్రమంత్రికి బుధవారం వివరించారు. ముఖ్యంగా హెలికాప్టర్‌లో ఎటువంటి సాంకేతిక లోపం, విద్రోహ చర్య జరిగే వీలులేదని దర్యాప్తు బృందం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ప్రతికూల వాతావరణం లేదా పైలట్‌ తప్పిదం కారణంగా నియంత్రణలో ఉన్న విమానం నేల, నీరు లేదా ఏదైనా ఎత్తైన ప్రదేశంపై పడడాన్ని కంట్రోల్డ్‌ ఫ్లైట్‌ ఇన్‌టూ టెర్రెయిన్‌ (CFIT)గా పరిగణిస్తారు. విమానం ల్యాండింగ్‌ సమయంలో లేదా ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే CFIT సంభవిస్తుందని వైమానికరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ ప్రకారం, విమానం నియంత్రణ కోల్పోతున్నట్లు ఎలాంటి సూచనలు లేకుండా ఎత్తైన ప్రదేశం, నీరు, భూమిని ఢీకొట్టే ప్రమాదాన్ని CFIT సూచిస్తుంది. అయితే, తాజా నివేదికపై మాత్రం ఇప్పటివరకు అటు ప్రభుత్వం నుంచి కానీ, భారత వాయుసేన నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు.

ఇదిలాఉంటే, డిసెంబర్‌ 8, 2021 నాడు భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌ తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో కుప్పకూలింది. నాటి దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్నవారందరూ ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని