Bipin Rawat: బిపిన్‌ రావత్‌.. చదివిన చోటే మృత్యు ఒడిలోకి..!

వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు బయలుదేరిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోగా.. బిపిన్‌ రావత్‌ అదే కాలేజీ పూర్వ విద్యార్థి.

Updated : 08 Dec 2021 22:06 IST

బిపిన్‌ రావత్‌ వెల్లింగ్టన్‌ పూర్వ విద్యార్థి

చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాద ఘటనలో భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే వీరిని సమీపంలోని వెల్లింగ్టన్‌ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అయితే, వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు బయలుదేరిన సమయంలోనే ప్రాణాలు కోల్పోవడాన్ని కాలేజీ సిబ్బంది, అధ్యాపకులు నమ్మలేకపోతున్నారు. బిపిన్‌ రావత్‌ అదే కాలేజీ పూర్వ విద్యార్థి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరిన తర్వాత డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలోనే ఆయన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. తాజాగా వెల్లింగ్టన్‌ అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. తాను చదువుకున్న చోటుకు వెళుతున్న క్రమంలో బిపిన్‌ రావత్‌ మృత్యువాత పడడం విషాదాన్ని నింపింది.

ఉత్తరాఖండ్‌ పౌరీ జిల్లాలో జన్మించిన బిపిన్‌ రావత్‌ విద్యాభ్యాసం దెహ్రాదూన్‌లోని కాంబ్రియన్‌ హాల్‌ పాఠశాల, శిమ్లాలోని సెయింట్‌ ఎడ్వర్డ్‌ స్కూళ్లలో పూర్తయ్యింది. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన ఆయన.. పాఠశాల విద్య తర్వాత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరారు. తమిళనాడు నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్‌ కంటోన్మెంట్‌లో ఉన్న డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీలో (DSSC)లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆ తర్వాత అమెరికాలోని కాన్సాస్‌లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆర్మీ కమాండ్‌ అండ్‌ జనరల్‌ స్టాఫ్‌ కాలేజీలో హైయ్యర్‌ కమాండ్‌ కోర్స్‌ను పూర్తి చేశారు. దేవీ అహల్యా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌  పూర్తిచేశారు. వెల్లింగ్టన్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు కూనూర్‌ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ను వెల్లింగ్టన్‌లోని సైనిక ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మాత్రం ప్రస్తుతం వెల్లింగ్టన్‌ మిలటరీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని