Lakhimpur Case: మంత్రి రాజీనామాకు విపక్షాల పట్టు.. తోసిపుచ్చిన కేంద్రం!

కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా వెంటనే తన పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్లమెంటులో దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.

Published : 15 Dec 2021 22:55 IST

ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న పీయూష్‌ గోయల్‌

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరీలో రైతులపై జరిగిన కారు దాడి ఘటన కుట్రలో భాగమేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా వెంటనే తన పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్లమెంటులో దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చింది. లఖింపుర్‌ ఖేరీ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేసింది.

‘ఈ కేసుపై సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతోంది. విపక్షాలు చేస్తోన్న కామెంట్లు నిరాధారమైనవి’ అని కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఇదే అంశంపై సభలో చర్చించాలని విపక్షాలు పట్టుపడుతోన్న విషయంపై స్పందించిన ఆయన.. కోర్టు పరిధిలో ఉన్న అంశాలు సభలో చర్చించరాదని పార్లమెంటరీ నియమాలు నిర్దేశిస్తున్నాయని గుర్తు చేశారు.

ఇక 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ విపక్షాలు ఆందోళన చేయడంపై పీయూష్‌ గోయల్‌ మండిపడ్డారు. భద్రతా సిబ్బందిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకే సభ్యులపై చర్యలు తీసుకున్నామన్న ఆయన.. సభ్యులు వారి ప్రవర్తనపై క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు విపక్ష పార్టీలకు ఎలాంటి సమస్యలు దొరకడం లేదనే విషయం అర్థమవుతోందన్నారు. పౌరులకు సంబంధించిన అంశాలపై మాట్లాడే శ్రద్ధ విపక్షాలకు లేదని కేంద్రమంత్రి విమర్శలు గుప్పించారు. ధరల పెరుగుదలపై లోక్‌సభలో, కొవిడ్‌ పరిస్థితులపై రాజ్యసభలో చర్చకు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైనప్పటికీ విపక్షాల నిరసనల వల్లే ఉభయసభలు వాయిదా పడుతున్నాయని అన్నారు.

ఇదిలాఉంటే, అంతకుముందు ఇదే అంశంపై లోక్‌సభలో చర్చకు పట్టుబట్టిన విపక్ష పార్టీలు.. అజయ్‌ మిశ్రాను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశాయి. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే రాహుల్‌ అభ్యర్థనను స్పీకర్‌ అంగీకరించలేదు. దీంతో ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభ్యులను మరోసారి వారించిన స్పీకర్‌.. సభ మర్యాదను కాపాడాలని వారికి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో కొంతసమయం పాటు సభను వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని