26/11 Mumbai Attacks: అమాయకులను చంపితే సహనమా? అది బలహీనతే..

ముంబయిలో జరిగిన 26/11 దాడుల అనంతరం జాతీయ భద్రత విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

Published : 23 Nov 2021 16:28 IST

కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ పుస్తకంలో ప్రస్తావన

దిల్లీ: ముంబయిలో 26/11 దాడుల అనంతరం జాతీయ భద్రత విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ముంబయిలో పాకిస్థాన్‌ ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సమయంలో అధికారంలో ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ భద్రత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని కాంగ్రెస్‌ పార్టీకే చెందిన సీనియర్‌ నేత, యూపీఏలో మంత్రిగా పనిచేసిన మనీష్‌ తివారీ పేర్కొన్నారు. తాజాగా ఆయన రాసిన పుస్తకంలో ఈ విషయాలు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన భాజపా.. యూపీఏ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతోంది. అప్పటి యూపీఏ ప్రభుత్వానిది అసమర్థ, బలహీన పాలన అని మరోసారి స్పష్టమైందంటూ దుయ్యబట్టింది.

గడిచిన రెండు దశాబ్దాల్లో భారత జాతీయ భద్రతకు ఎదురైన సవాళ్లపై ‘10 ఫ్లాష్‌ పాయింట్స్‌: 20 ఇయర్స్‌ - నేషనల్‌ సెక్యూరిటీ సిచ్యువేషన్స్‌ దట్‌ ఇంపాక్టెడ్‌ ఇండియా’ అనే పేరుతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ప్రస్తుత ఎంపీ మనీష్‌ తివారీ ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తక సారాంశాన్ని తెలియజేస్తూ..  డిసెంబర్‌ 1న విడుదల కానున్నట్లు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. ముఖ్యంగా యావత్‌ దేశాన్ని వణికించిన ముంబయి దాడుల అనంతరం పరిస్థితులను అందులో ప్రస్తావించిన మనీష్‌ తివారీ.. ‘వందలాది మంది అమాయకులను అత్యంత క్రూరంగా హతమార్చిన సందర్భంలో సహనంతో ఉండడమనేది బలానికి సంకేతం కాదు. అది కచ్చితంగా బలహీనతకు సంకేతమే. కొన్ని సందర్భాల్లో మాటలకంటే చేతలతోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 26/11 దాడుల ఘటన కూడా అటువంటి సమయమే. కాబట్టి, ఆ సమయంలో భారత్‌ ప్రతిస్పందన మరింత బలంగా ఉండాల్సిందని నా అభిప్రాయం’ అంటూ యూపీఏ ప్రభుత్వం స్పందించిన తీరును మనీష్‌ తివారీ పరోక్షంగా విమర్శించారు.

మనీష్‌ తివారీ తన పుస్తకంలో పేర్కొన్న విషయాలను ప్రస్తావించిన భాజపా.. జాతీయ భద్రత విషయంలో యూపీఏ ప్రభుత్వం ఎంత బలహీనంగా వ్యవహరించిందో స్పష్టంగా అర్థమవుతోందని మండిపడింది. పాకిస్థాన్‌పై దీటుగా స్పందించేందుకు అప్పట్లో మన సైన్యానికి ఎందుకు స్వేచ్ఛ ఇవ్వలేదన్న భాజపా.. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌ గాంధీలు ఈ విషయంపై మౌనం వీడుతారా? అంటూ భాజపా అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, నవంబర్‌ 26, 2008లో పదిమంది పాకిస్థాన్‌ ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడితో ముంబయి నగరం వణికిపోయిన విషయం తెలిసిందే. ఆ మారణహోమంలో దాదాపు 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మూడురోజుల పాటు కొనసాగిన ఆ దాడుల్లో అజ్మల్‌ కసబ్‌ను భారత భద్రతా దళాలు ప్రాణాలతో పట్టుకోగలిగారు. చివరకు కసబ్‌కు నవంబర్‌ 26, 2012లో ఉరిశిక్ష పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని